హరితంలో 'ఆ' మొక్కలకే అధిక ప్రాధాన్యం | Harita Haram Focuses On Increasing The Revenue Of Caste Occupations | Sakshi
Sakshi News home page

హరితంలో 'ఆ' మొక్కలకే అధిక ప్రాధాన్యం

Published Sat, Aug 31 2019 12:38 PM | Last Updated on Sat, Aug 31 2019 12:40 PM

Harita Haram Focuses On Increasing The Revenue Of Caste Occupations - Sakshi

సాక్షి, సిద్దిపేట: జిల్లాలో నాలుగు విడతలుగా జరిగిన హరితహారంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో మొక్కలు నాటారు. ఈ ఉత్సాహాన్ని మరింత ప్రొత్సహించేందుకు అధికారులు వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. మొక్కల పెంపకంలో కుల వృత్తులకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు. గీత కార్మికులకు తాటి, ఈత, ఖర్జూర, గిరకతాడు మొక్కలు, ముదిరాజులకు సీతాఫలం,అల్ల
నేరేడు వంటి పండ్ల మొక్కలు అందజేస్తున్నారు. వీటితోపాటు  తుమ్మలను పరిరక్షించి గొర్రెలు, జీవాలను మేపేందుకు కంచెలు, చెరువు శిఖాల్లో నల్లతుమ్మ మొక్కలను పెంచేందుకు గొల్ల
కురుమలను భాగస్వామ్యులను చేస్తున్నారు.   

హుస్నాబాద్‌ మండలం పోతారం(జే)లో  ఖర్జూర మొక్కలు నాటేందుకు సిద్ధమైన స్థానికులు(ఫైల్‌) 

కాలనుగుణంగా కొన్ని, రియలెస్టేట్‌ పుణ్యమా అని కొన్ని, భూమిని చదును చేయడం, కాల్వలు తవ్వడంతో గ్రామాల్లో ఉన్న తాటి, ఈత చెట్లు కనుమరుగవుతున్నాయి. దీంతో గీత కార్మికులకు ఉపాధి కోల్పోతున్నారు. దీన్ని గమనించిన అధికారులు ప్రభుత్వం నుంచి గీతకార్మికుల సొసైటీలకు అందచేసిన ఐదెకరాల భూమితోపాటు, చెరువులు, కాల్వల గట్లపై ఈత, తాటి, గిరకతాడు, ఖర్జూర మొక్కలు నాటిస్తున్నారు. జిల్లాలో 66,987 మంది గీతా కార్మికులు, ఈడిగ మొదలైనవారు ఉండగా ఇప్పటి వరకు 5 లక్షల ఈత, 8 వేల గిరకతాటి మొక్కలను నాటారు. ఇందులో కొన్ని రెండు, మూడు సంవత్సరాల వయస్సుకు రావడంతో మరుసటి సంవత్సరం కోతకు వస్తాయని చెబుతున్నారు.

అదేవిధంగా జిల్లాలో ముదిరాజులు, గంగపుత్రులు, బెస్త కులాల వారు 1,84,429 మంది ఉన్నారు. చెరువుల్లో చేపలు పెంచడం, వాటిని పట్టి అమ్మడమే ప్రధాన వృత్తి, మిగితా కాలంలో సీతాఫలం, అల్లనేరేడు, తునికి పండ్లతోపాటు కందమూలాలు కూడా తీసుకవచ్చి అమ్ముతారు. అయితే కాలం కలిసి రాకపోవడం వర్షాలు కురువకపోవడంతో వీరి వృత్తి ప్రమాదంలో పడింది. ఇటువంటి పరిస్థితిలో గ్రామాల్లో ఉన్న గుట్టలు, ఏనెలు, పొరంబోకు భూముల్లో పండ్ల మొక్కలను పెంచేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 16 లక్షల సీతాఫలం మొక్కలను నాటారు. అదేవిధంగా గొల్లకురుమలకు ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేసింది. అయితే అవి మేసేందుకు తావు లేకుండా పోయింది. ప్రభుత్వం ఇచ్చిన భూమితోపాటు, చెరువు శిఖం మొదలైన ప్రాంతాల్లో నల్లతుమ్మల పెంపకానికి శ్రీకారం చుట్టరు. ఇలా కుల వృత్తులకు ఉపాధి కల్పించే మార్గంతో పాటు, ప్రభుత్వ లక్ష్యం హరితహారం విజయవంతం చేసేందుకు ముందుకు వెళ్తున్నారు. 

జిల్లాలో నాటిన మొక్కలు

ఈత        4.30లక్షలు
సీతాఫలం         16లక్షలు
గిరకతాడు          8వేలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement