
మూడేళ్లలో హరిత తెలంగాణ
* ‘హరిత హారం’ కార్యక్ర మానికి శ్రీకారం చుట్టిన సర్కారు
* రాష్ట్రాన్ని హరిత వనంగా మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం
* ప్రతి నెలలో ఒక వారం పచ్చదన వారోత్సవ కార్యక్రమాలు
* తెలంగాణ వ్యాప్తంగా 210 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక
* అటవీ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లలో రాష్ట్రాన్ని హరితవనంగా మార్చేందుకు తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. ‘హరిత హారం’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వాములను చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంకల్పించింది. రాష్ట్రంలో 33 శాతం భూభాగాన్ని పచ్చదనంతో నింపేందుకు సుమారు 210 కోట్ల మొక్కలు నాటాల్సి ఉంటుందని అంచనా వేసిన ప్రభుత్వం.. దీన్ని అమల్లో పెట్టడం ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులతో శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమీక్ష జరిపారు.
రాష్ట్రం మొత్తంగా... హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)తో పాటు అన్ని జిల్లాల్లోనూ మొక్కల పెంపకం, నర్సరీల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణపై ఈ సందర్భంగా చర్చించారు. ప్రతీ నెలలో ఒక వారం పచ్చదన వారోత్సవం పాటించాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ వారోత్సవంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులంతా పాల్గొనాలని సూచించారు. మూడేళ్లలో హెచ్‌ఎండీఏ పరిధిలో 10 కోట్ల మొక్కలను నాటాలని నిర్ధేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఏటా 40 లక్షల మొక్కలు నాటేలా, అవి బతికేలా అన్ని చర్యలు చేపట్టాలని కేసీఆర్ పేర్కొన్నారు. తరిగిపోతున్న అటవీ సంపదను కాపాడుకునేందుకు భారీ స్థాయిలో మొక్కలు నాటాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.
సింగపూర్ తరహాలో ప్రణాళికాబద్ధంగా పచ్చదనాన్ని పెంచాలని సూచించారు. రహదారుల పక్కనే మొక్కలు నాటడం పాత పద్ధతని, అలాకాకుండా అటవీ ప్రాంతంలో నడుస్తున్నామన్న భావన ప్రజల్లో కలిగేలా ఈ పెంపకం ఉండాలని చెప్పారు. అన్ని నదుల పరీవాహక ప్రాంతాలు, అన్ని చెరువుల గట్లపై, వివిధ విద్యా, పారిశ్రామిక సంస్థల, ప్రభుత్వ సంస్థల్లోని ఖాళీ ప్రదేశాల్లోనూ, యూనివర్సిటీ ఆవరణల్లోనూ మొక్కల పెంపకం చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో ఇంటి నిర్మాణ అనుమతికి ముందే మొక్కలు నాటడం తప్పనిసరి చేయాలన్నారు. రావి, మర్రి, వేప, అశోక చెట్టు, పూల మొక్కలను ఎంపిక చేసి నాటించాలని సూచించారు. వీటికి అవసరమైన నిధులను జాతీయ ఉపాధి హామీ పథకం, కంపా(కాంపెన్సేటరీ అఫాస్ట్రేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) నుంచి తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు.
సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ప్రతి నాలుగైదు గ్రామాలకు ఓ నర్సరీని ఏర్పాటుచేసి మొక్కల పెంపకం చేపట్టాలని, అందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని కూడా ఆదేశించారు. ఈ కార్యక్రమం అమలును అన్ని స్థానిక సంస్థల సమావేశాల్లో విధిగా చర్చించేలా చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా అటవీ అధికారులు సంయుక్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి కార్యక్రమ అమలును ఖరారు చేయాలని నిర్దేశించారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, హెచ్‌ఎండీఏ కమిషనర్ నీరజ్‌కుమార్ ప్రసాద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య అధికారి మిశ్రా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.