మెుక్కల సంరక్షణకు జియోటాగింగ్
-
అధికారులకు కలెక్టర్ కరుణ ఆదేశం
హన్మకొండ అర్బన్ :
జిల్లాలో హరితహారం కార్యక్రమం కింద నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు, మొక్క స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు జియోటాగింగ్ విధానం అమలు చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి అటవీశాఖ సాంకేతిక నిపుణుడు బాలకృష్ణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జియోటాగింగ్‌పై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. హరితహారంలో నాటిన మొక్కలను ప్రదేశాల వారీగా మూడు రోజుల్లో జియోటాగింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం ప్రతి శాఖకు కేటాయించిన యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో మొక్కల వివరాలు ఆన్‌లైన్‌లో మొబైల్ అప్లికేషన్‌లో నమోదు చేయాలన్నారు. అనంతరం సాగునీటి పారుదల, విద్యాశాఖ, ఎక్సైజ్, ఉద్యాన వన శాఖ, ఇంజనీరింగ్ శాఖల వారీగా లక్ష్యాలను సమీక్షించారు. జిల్లాలో 4 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం అన్ని శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, సీపీఓ బీఆర్‌రావు, డీఎఫ్‌ఓ శ్రీనివాస్, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.