
నేరాల నివారణకే సీసీ కెమెరాల ఏర్పాటు
– ఎస్పీ ప్రకాష్‌రెడ్డి
– శాంతిభద్రతల పరిరక్షణకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచన
డిండి :
నేరాల నివారణకే సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలు, పోలీస్‌స్టేషన్‌లోని కంట్రోల్ రూమును ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానంలో భాగంగా నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరారు. దసరా నుంచి ప్రారంభం కానున్న నూతన జిల్లాలు, మండలాల్లో ఇప్పటికే పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రానున్న బతుకమ్మ, దసరా, మొహర్రం వేడుకల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఎస్పీ ప్రకాష్ డిండి ప్రాజెక్టును సందర్శించారు. చాలా రోజుల తర్వాత డిండి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరడం పట్ల ఎస్పీ హర్షం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఓఎస్డీ వెంకట్‌రెడ్డి, దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్, రూరల్ సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి, దేవరకొండ సీఐ రామకృష్ణ, డిండి ఎస్‌ఐ శేఖర్, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు.