నీటిని సద్వినియోగం చేసుకోవాలి
నీటిని సద్వినియోగం చేసుకోవాలి
Published Wed, Aug 24 2016 9:44 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
మిర్యాలగూడ : ఖరీఫ్‌లో సాగర్ ఎడమ కాల్వకు విడుదల చేసే నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎన్‌ఎస్‌పీ క్యాంపులో ఎన్‌ఎస్‌పీ అధికారులు నీటి విడుదల, వినియోగంపై రైతులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడారు. ఇటీవల కృష్ణానది ఎగువ భాగంలో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ వాటాలో 30 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉందన్నారు. దాంతో ప్రస్తుతం ఆయకట్టు పరిధిలో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు గాను ఎట్టి పరిస్థితుల్లో నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని, నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నీటి విడుదలపై జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో నిర్వహించే సమావేశంలో నిర్ణయించనున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నీటి విడుదలకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు. ఈ సందర్బంగా పలువురు రైతులు మాట్లాడుతూ సాగర్ ఎడమ కాల్వకు నిరంతరాయంగా 25 రోజుల పాటు నీటిని విడుదల చేసి పంటలు కాపాడాలని కోరారు. కాగా ఎన్‌ఎస్‌పీ సీఈ సునిల్, ఎస్‌ఈ అంజయ్య మాట్లాడుతూ సాగర్ ఎడమ కాలువకు ప్రజాప్రతినిధుల, రైతుల అభిప్రాయం మేరకు 15 రోజుల పాటు నిరంతరాయంగా నీటిని విడుదల చేయాలని, ఆ తర్వాత వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేయడానికి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ఇంజనీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పన విజయసింహారెడ్డి, వేనేపల్లి చందర్‌రావు, డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, టీఆర్‌ఎస్ నాయకులు సాములు శివారెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గాయం ఉపేందర్‌రెడ్డి, చిట్టిబాబునాయక్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కర్నాటి రమేష్, ప్రజాప్రతినిధులు, డీసీ చైర్మన్‌లు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement