♦ ఎన్నికలకు సమయం కావాలని కోర్టుకెక్కిన సర్కారు
♦ నోటిఫికేషన్ పై తొలగని ఉత్కంఠ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : శివారు గ్రామ పంచాయతీల ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాజధాని సమీపంలోని 11 గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ రాష్ర్ట ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. శుక్రవారంలోగా వీటి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేయాలని హైకోర్టు గడువు విధించింది. మొదట్నుంచి ఈ పంచాయతీలను పురపాలకశాఖలో విలీనం చేసేందుకు మొగ్గు చూపుతున్న సర్కారు.. పట్టు వదలకుండా మరోసారి ఎన్నికల నిర్వహణపై న్యాయస్థానం గడప తొక్కింది. ప్రస్తుతం అధికారయంత్రాంగం హరితహారం కార్యక్రమంలో తలమునకలై ఉన్నందున.. ఎన్నికలకు సమయం కావాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది.
దీనిపై వెల్లడయ్యే ఆదేశాలకు లోబడి ముందడుగు వేయాలని ప్రభుత్వవర్గాల ద్వారా తెలిసింది. సరూర్‌నగర్ మండలం జిల్లెలగూడ, పహడీషరీఫ్, మీర్‌పేట, బాలాపూర్, కొత్తపేట, జల్‌పల్లి.. ఘట్‌కేసర్ మండలం ఫీర్జాదిగూడ, బోడుప్పల్, మేడిపల్లి, పర్వతాపూర్, చెంగిచర్ల పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల పట్ల స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ సర్కారు వెనక్కి తగ్గింది. ఈక్రమంలోనే ఈ గ్రామాలను పురపాలికలుగా మలచాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చారుు.
దీంతో ఈ పంచాయతీలకు ఎన్నికలు జరుపకుండా ప్రభుత్వం వారుుదా వేసింది. నాలుగేళ్లుగా పాలకవర్గాల్లేక పోవడంతో సమస్యలు పరిష్కారం కావడంలేదని, వీటిని మున్సిపాలిటీలుగానైనా ప్రకటించండి లేదా ఎన్నికలైనా నిర్వహించండి అని స్థానికులు కొందరు న్యాయస్థానాన్ని ఆదేశించారు. దీంతో వాయువేగంతో స్పందించిన సర్కారు.. ఈ గ్రామాలను కలుపుతూ ఐదు కొత్త మున్సిపాలిటీలను ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానంలో పలు వ్యాజ్యాలు దాఖలు కావడం.. వాటిని విచారించిన ధర్మాసనం ప్రభుత్వ జీఓను కొట్టివేయడంతో కథ మొదటికొచ్చింది.
ఈ పరంపరలోనే వీటికి ఈ నెల 15వ తేదీలోగా నోటిఫికేషన్ జారీ చేయాలని ఎస్‌ఈసీని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్‌శాఖకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. మున్సిపాలిటీలుగా మార్చిన అంశం ఇంకా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు మరికొంత గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై వెలువరించే తీర్పు ఆధారంగా ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుంది.