- హాజరుకానున్న 52,028 మంది అభ్యర్థులు
- 135 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
- అభ్యర్థులు ఉదయం 9.45 గంటల్లోపు చేరుకోవాలి
అనంతపురం అర్బన్ / అగ్రికల్చర్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో గ్రూపు–2 పరీక్షను ఆదివారం నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 135 కేంద్రాల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగుతుంది. 52,028 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. క్యాలికులేటర్లు, సెల్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి అనుమతించరు. అభ్యర్థులను ఉదయం తొమ్మిది నుంచి 9.45 గంటల వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతింబోమని కలెక్టర్ కోన శశిధర్ శనివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్ తీసుకెళ్లాలి. వెరిఫికేషన్ కోసం హాల్‌టికెట్‌తో పాటు పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్..వీటిలో ఏదో ఒకటి ఒరిజినల్ తీసుకొని వెళ్లాలి. హాల్ టికెట్‌లో అభ్యర్థి ఫొటో లేకున్నా, సరిగా ముద్రణ కాకున్నా, చిన్నదిగా ఉన్నా, ఫొటోపై సంతకం లేకున్నా మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించి ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. లేదంటే పరీక్షకు అనుమతించరు. ఆర్టీసీ ఆధ్వర్యంలో అనంతపురం బస్టాండ్, రైల్వేస్టేషన్ నుంచి పరీక్షా కేంద్రాల వరకు బస్సులు నడపనున్నారు.
పరీక్ష నిర్వహణపై జేసీ సమీక్ష
గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తన క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, చీఫ్ సూపరింటెండెంట్లతో సమీక్షించారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పించాలని ఆదేశించారు. ఎండలు అధికంగా ఉన్నందున తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. వైద్య శిబిరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ఓఆర్‌ఎస్ (ఓరల్ రీ హైడ్రేషన్ సాల్ట్) ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. పోలీస్ బందోబస్తు పకడ్బందీగా ఉండేలా చూసుకోవాలన్నారు. కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలన్నారు. ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారులు, అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 84980 98220 సెల్ నంబరుకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
నేడు గ్రూప్-2 పరీక్ష
Published Sun, Feb 26 2017 12:02 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement