ఉదయం 8.23కి తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
వెలగపూడిలో 197 సర్వే నంబరులో ఎంపిక
తాడికొండ/సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు ఉదయం 8.23 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. మందడం-మల్కాపురం గ్రామాల మధ్య వెలగపూడి గ్రామ రెవెన్యూ పరిధిలో 196 సర్వే నంబరు నుంచి 216 సర్వేనంబర్లలోని భూముల్లో తాత్కాలిక సచివాలయ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. దీనిలో 204, 209 సర్వే నంబర్లకు సంబంధించి ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో మొత్తం 45 ఎకరాల భూమిలో.. 28.4 ఎకరాల్లో భవన నిర్మాణాలు, 17 ఎకరాల్లో పార్కింగ్ స్థలాల్ని ఏర్పాటు చేయనున్నారు. 197 సర్వేనంబరు భూమిలో సీఎం బుధవారం శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన ప్రాంతాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మంగళవారం పరిశీలించారు. ఆయన వెంట సీఎం భద్రతాధికారి జోషి, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్, జేసీ చెరుకూరి శ్రీధర్ తదితరులున్నారు.
సకల హంగులతో నిర్మాణం: తాత్కాలిక సచివాలయాన్ని సకల హంగులతో నిర్మించనున్నారు. 6 భవనాలపైనా సౌర ఫలకాల్ని అమర్చి సచివాలయానికి అవసరమయ్యే విద్యుత్‌నంతటినీ సమకూర్చాలని సీఆర్‌డీఏ ప్రణాళిక రూపొం దించింది. సముదాయంలో భారీఎత్తున పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సుమారు ఐదువేల మంది ఉద్యోగులు, అధికారులు పనిచేసే సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ భవనాలకు ప్రత్యేకంగా నీటిసరఫరా వ్యవస్థను, మురుగునీటి శుద్ధిప్లాంటును నెలకొల్పుతున్నారు. ఈ ఆరు భవనాలను కాంక్రీట్‌తోనే నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు ఏపీ తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన
Published Wed, Feb 17 2016 2:48 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement