పాలేరు ఫలితం నేడే
♦ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం
♦ 18 రౌండ్లలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు
♦ 10 గంటలకల్లా అభ్యర్థుల భవితవ్యం తేలే అవకాశం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పాలేరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఖమ్మంలోని పత్తి మార్కెట్ యార్డు ప్రాంగణంలో గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో నిలవగా... ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితారెడ్డి, సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్ మధ్య పోటీ నెలకొంది. 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో పాలేరులో ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన ఓటింగ్‌లో మొత్తం 1,90,351 ఓట్లకు 1,71,061 ఓట్లు (89.87 శాతం) పోలయ్యాయి. గురువారం ఖమ్మం పట్టణంలోని పత్తి మార్కెట్ యార్డులో ఈ ఓట్ల లెక్కింపు జరుగనుంది. 243 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 243 ఈవీఎంలను 14 టేబుళ్లపై ఉంచి.. 66 మంది సిబ్బంది 18 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నారు. లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేస్తారు.