
నేడు విజయవాడకు సింధు
ఇందిరాగాంధీ స్టేడియంలో సన్మాన కార్యక్రమం
విజయవాడ/గాంధీనగర్: రియో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత పీవీ సింధు మంగళవారం విజయవాడకు రానున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రభుత్వం తరఫున ఆమెను సన్మానించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు పాల్గొంటారు. సింధు రాక సందర్భంగా విజయవాడలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సింధుకు రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో 1,000 గజాల స్థలం, రూ.3 కోట్ల నగదు, గ్రూపు-1 ఉద్యోగం నజరానాగా ప్రకటించిన విషయం తెలిసిందే.
సన్మాన కార్యక్రమంలో సీఎం అధికారికంగా వీటిని ప్రకటించనున్నారు. రియో నుంచి సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్న సింధును మంగళవారం విజయవాడ రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆహ్వానించింది. మరోవైపు కృష్ణా పుష్కరాల ముగింపు కార్యక్రమంలోనూ పీవీ సింధు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నిత్యహారతికి ముందు పవిత్ర సంగమం వద్ద సింధుకు చిరు సత్కారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పుష్కరాల ప్రత్యేక అధికారి బి.రాజశేఖర్ తెలిపారు.