షా–అలీ–పహిల్వాన్ దర్గా
-
26న సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తీలు
-
27న ధడ్ ముబారక్ దర్గాలో పెద్ద కిస్తీలు
అలంపూర్: మత సామరస్యానికి ప్రతీకగా జరిగే అలంపూర్ షా–అలీ–పహిల్వాన్ ఉర్సు గురువారం నుంచి ప్రారంభమవుతుందని దర్గా అభివృద్ధి కమిటీ చైర్మన్ రుక్ముద్దీన్, ఉపాధ్యక్షుడు షఫీ అహ్మద్, మోక్తార్ బాషా, ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ముజీబ్, కార్యదర్శులు ఎండీ జాఫర్, ఖాసీమ్ మియ్య తెలిపారు. సయ్యద్ ఖాదర్ వలి సాహెబ్ కుమారుడు దర్గా చైర్మన్ సయ్యద్ షా అహ్మద్ ఒవైసీ ఖాద్రి ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి 28 వరకు ఉర్సు జరగనున్నట్లు పేర్కొన్నారు. కులమతాలకతీతంగా జరిగే ఈ ఉత్సవాలకు వేలాది మంది జనం తరలిరావడంతో వారికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
4రోజుల పాటు ఉత్సవాలు
ఈ నెల 25వ తేదీ నుంచి 28వరకు ఉర్సు జరగనుంది. 25వ తేదీ రాత్రి గంధోత్సవం ఉంటుంది. సయ్యద్ ఖాదర్ వలి సాహెబ్ ఇంటి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి గంధం తీసుకెళ్తారు. అక్కడి నుంచి సర్ ముబారక్, ధడ్ ముబారక్ దర్గాలలో గంధోత్సవం నిర్వహించనున్నారు. 26న సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తీలు జరగనున్నాయి. 27న ధడ్ ముబారక్ దర్గా వద్ద పెద్ద కిస్తీలు నిర్వహించనున్నారు. పెద్ద కిస్తీ పోటీలను వీక్షించడానికి వేలాదిమంది జనం తరలి రానున్నారు. 28న మహిళల ప్రత్యేక ఉర్సుతో ఉత్సవాలు ముగుస్తాయి.
దూర ప్రాంతాల నుంచి భక్తుల రాక
షా–అలీ–పహిల్వాన్ ఉర్సుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో పాటుగా జిల్లాలోని ప్రముఖ పట్టణాలు, కర్నూలు, కర్ణాటకలోని రాయచూరు నుంచి తరలిరానున్నారు. ఉత్సవాల్లో పెద్ద కిస్తీ పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.