విద్యార్థులను వేధిస్తున్న మరుగుదొడ్ల సమస్య
విద్యార్థులను వేధిస్తున్న మరుగుదొడ్ల సమస్య
Published Wed, Aug 3 2016 1:18 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM
l విద్యార్థులను వేధిస్తున్న
మరుగుదొడ్ల సమస్య
l అండర్‌బ్రిడ్జిలోంచి
ఆరుబయటకు వెళ్తున్న బాలికలు
l శాఖాపూర్‌లో పొంచి
ఉన్న ప్రమాదం
l 275 మందికి రెండే
మరుగుదొడ్లు..!
అడ్డాకుల :
మండలంలోని శాఖాపూర్ గ్రామంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులు మరుగుదొడ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో విద్యార్థులు, విద్యార్థినులు ఆరుబయటకు వెళ్తున్నారు. హైవే విస్తరణలో పాఠశాల గదులను కొన్నింటినీ తొలగించడంతో సమస్యలు ఎక్కువయ్యాయి. ఇక్కడి పాఠశాలలో నిత్యం విద్యార్థులు మూత్ర పరీక్షను ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక పాఠశాలలో 115 మంది, ఉన్నత పాఠశాలలో 160 మందికి పైగా విద్యార్థులున్నారు. పాఠశాలలో ఇటీవల నిర్మించిన రెండు మరుగుదొడ్లు వారికి ఎందుకు సరిపోవడం లేదు. దీంతో విధిలేని పరిస్థతుల్లో చాలా మంది విద్యార్థులు బయటికే వెళ్తున్నారు.
అండర్ బ్రిడ్జిలోంచి బాలికలు..!
ఇటీవల ప్రాథమిక పాఠశాల కోసం రెండు మరుగుదొడ్లను నిర్మించారు. వాటిలో ఒకదాన్ని ప్రాథమిక పాఠశాల బాలికలు, మరోదాన్ని ఉన్నత పాఠశాల బాలికల కోసం వినియోగిస్తున్నా రెండు బడుల్లో ఉన్న విద్యార్థులకు అవి ఎందుకు సరిపోవడం లేదు. దీంతో బడి విరామ సమయంలో అండర్‌బ్రిడ్జిలోంచి బాలికలు ఆరుబయటకు పొలాల్లోకి వెళ్లక తప్పడం లేదు. తరగతి గదిలో పాఠాలు జరుగుతున్నప్పుడు బాలికలేవరైనా ఒంటరిగా బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. పొలాల్లోని చెట్ల మధ్యకు వెళ్లాల్సి రావడంతో విష సర్పాల మూలంగా ప్రమాదం పొంచి ఉంది.
సర్వీస్ రోడ్డుపై బాలలు..!
హైవే పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు మీదుగా బాలలు దూరంగా వెళ్లి మూత్ర విసర్జన చేసి వస్తున్నారు. హైవేపై వెళ్లే వాహనాలు అదుపు తప్పితే సర్వీస్ రోడ్డు మీదకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు నిత్యం భయాందోళనకు గురవుతుంటారు. బడిలో మరుగుదొడ్లు నిర్మించడానికి స్థలం లేకపోవడంతో బాలబాలికలందరు ఒంటికి రెంటికి బయటకే వెళ్తున్నారు. గ్రామానికి దూరంగా మరోచోట కొత్తగా పాఠశాల భవన నిర్మాణం సాగుతోంది. పనులు పూర్తయి బడిని అందులోకి మార్చే వరకు విద్యార్థులకు ఇబ్బందులు తొలిగే అవకాశం లేదు.
Advertisement