ధర ఢమాల్.. రైతు కుదేలు
- నష్టాల బాటలో టమాట రైతులు
- కూలిఖర్చులు కూడా గిట్టుబాటు కాని వైనం
- పొలాల్లోనే వదిలేస్తున్న రైతులు
అనంతపురం రూరల్ : మార్కెట్లో టమాట ధర ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం కిలో రూ.2 మాత్రమే పలుకుతోంది. దీంతో 90రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన రైతు కంట కన్నీరు ఉబుకుతోంది. ఎకరా పంట సాగుకు రైతులు రూ.40వేలు పెట్టుబడి పెడుతున్నారు. దీనికి తోడు కూలీ, రవాణ ఖర్చులు అదనంగా రూ.15వేలు కలిపి మొత్తం రూ. 55వేలు వెచ్చిస్తున్నారు. పంట ఆశాజనకంగా ఉంటే 25టన్నుల మేర ఎకరాకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టమాట కేజీ రూ.2 ధర పలుకుతోంది. ఈలెక్కన 25టన్నుల టమాటను రైతు అమ్మితే ఆయనకు వచ్చేది రూ.50వేలు కాగా అన్నీ పోనూ రూ.ఐదువేల నష్టం వాటిల్లుతోంది.
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత రబీలో 15వేల ఎకరాల్లో రూ.83 కోట్లు వెచ్చించి బోరు బావులున్న 10వేల మంది రైతులు టమాట పంటను సాగు చేస్తున్నారు. చీడ పీడల నుంచి పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. తీరా పంటను విక్రయించుకోవడానికి మార్కెట్‌కు తీసుకువస్తే గిట్టుబాటు ధరలేక కుదేలవుతున్నారు. కనీస గిట్టుబాటు ధర కూడా లభించకపోవడంతో వ్యవసాయమే దండగా అనే పరిస్థితికి వచ్చారు. మద్దతు ధర కల్పించి రైతులకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో టమాట రైతులు నిలువునా నష్టపోతున్నారు. వెంటనే అధికారులు, పాలకులు స్పందించి రైతుకు గిట్టుబాటయ్యేలా మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు.
రవాణ, కూలీ ఖర్చులకే సరి ..
రూ.2లక్షలు పెట్టుబడి పెట్టి నాలుగెకరాల్లో టమాట పంట సాగు చేశా. ఆశాజనకంగా దిగుబడి వచ్చింది. ప్రస్తుతం 152 టమాట బాక్సులను మార్కెట్‌కు తీసుకొచ్చా. గిట్టుబాటు ధర లేక ఒక్కో బాక్స్‌ను కేవలం రూ.30కే వదులుకోవాల్సి వచ్చింది. వచ్చిన సొమ్ము కాస్తా రవాణ ఖర్చులు కమీషన్‌కే సరిపోయింది.
– నారాయణ, పిల్లలపల్లి, బ్రహ్మసముద్రం మండలం
టమాటకు గిట్టుబాటు ధర కల్పించాలి
టమాటకు గిట్టుబాటు ధరలేక కిలో రూ.2 నుంచి 3కే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ సీజన్‌లోనే ఎక్కువ మంది రైతులు టమాట పంట సాగు చేస్తారు. రైతుకు గిట్టుబాటు అయ్యేలా ధరను మార్కెటింగ్ శాఖ అధికారులు నిర్ణయించి టమాట రైతును ఆదుకోవాలి.
–రామకృష్ణా, హంపాపురం
వచ్చిన కాటికి ముకోవాల్సిందే
మార్కెట్‌కు తీసుకువచ్చిన టమాట పంటను గిట్టుబాటు ధర ఉన్న లేకపోయిన పంటను మాత్రం అమ్ముకోవాల్సిందే. గిట్టుబాటు ధరలేదని వెనుక్కు తీసుకెళ్లే పరిస్థితి లేదు.
– శ్రీనివాసులు, గంగంపల్లి, రామిగిరి మండలం