కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన అధికారికంగా ఖరారు అయింది. జనవరి 2వ తేదీన ఉదయం 10 గంటలకు కర్నూలు జిల్లాకు చేరుకొని సాయంత్రం 5 గంటల వరకు నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ముచ్చుమర్రి లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను..ముఖ్యమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు మండలం తడకనపల్లిలో నాల్గో విడత జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు పగిడ్యాల మండలం నెహ్రూనగర్ చేరుకుని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసే స్థూపాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం వివిధ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా కల్లూరు మండలం తడకనపల్లికి చేరుకొని పశువుల హాస్టల్‌ను ప్రారంబిస్తారు. అక్కడ నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో 3 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పాల్గొని.. హెలికాప్టర్‌లో బయలు దేరి హైదరాబాద్ వెళతారు.