డివిజన్‌లో రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి
కరీంనగర్ కార్పొరేషన్ : జిల్లాకేంద్రంలో మట్టిరోడ్లు కనబడకుండా అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం 49, 35 డివిజన్‌లలో రూ.29 లక్షలు, రూ.12 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మొక్కలు నాటారు. 40 ఏళ్లుగా జరగని అభివృద్ధిని టీఆర్‌ఎస్ రెండేళ్లలో చేసి చూపెడుతోందని, తెలంగాణకు గుండెకాయలాంటి కరీంనగరాన్ని సీఎం కేసీఆర్ హామీలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఇప్పటివరకు రూ.100 కోట్లకుపైగా రోడ్ల అభివృద్ధికి మంజూరు చేశామని, దసరా వరకు ప్రధాన రోడ్ల పనులన్నీ పూర్తవుతాయని పేర్కొన్నారు. రూ.300 కోట్లతో మానేరు వాగుపై చెక్‌డ్యాం నిర్మాణం, బోటింగ్ ఏర్పాటు, రూ.150 కోట్లతో బృందావనం వంటి గార్డెన్ నిర్మిస్తామన్నారు. ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ టెండర్లలో లెస్‌కు పనులు దక్కించుకున్నా నాణ్యత పాటించాల్సిందేనన్నారు.