రైతు ఆత్మలకు శాంతి క్రతువు
ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు
రాజ్యసభ మాజీ సభ్యుడు శివాజీ పిండప్రదానం
అమరావతి (గుంటూరు రూరల్) : అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారి ఆత్మలకు శాంతి చేకూరేందుకు సామూహిక పిండ ప్రదానం చేస్తున్నామని రైతు నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి శివాజీ తెలిపారు. అమరావతిలోని ధ్యాన బుద్ధ ఘాట్‌లో సోమవారం ఆయన పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం గతంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా లక్షా యాభై వేల మంది, రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది రైతులు ఇప్పటివరకూ ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వ్యవసాయంలో నష్టాలు రావడం ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం వల్ల ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయన్నారు. రైతులను ప్రభుత్వాలు ఎల్లప్పుడూ ఆదుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం సమాజంలో మానవతా విలువలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో గతంలో ఒక బిచ్చగాడు చనిపోతే స్థానిక బిచ్చగాళ్లు అతనికి కర్మకాండలు నిర్వహించి, ఆరోజు బిచ్చమెత్తుకునేందుకు సమ్మెను ప్రకటించారని తెలిపారు. వారికున్న మానవత్వం మనకులేదా అని ప్రశ్నించారు. అడవిలో ఒక జంతువుకు ఏదైనా ప్రమాదం జరిగితే మిగిలిన జంతువులు వేరే జంతువును అక్కడకు రాకుండా కాపు కాస్తాయని వాటికున్న ఐక్యత కూడా మానవులకు లేకుండా పోతోందన్నారు. ప్రభుత్వాలు రైతులను పట్టించుకోకుంటే ఉపద్రవం తప్పదన్నారు. రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలుతాయన్నారు. అనంతరం సామూహిక పిండ ప్రదానం చేశారు. కార్యక్రమంలో భారత రైతు సమాఖ్య, అవగాహన, తదితర సంస్థల సభ్యులు పాల్గొన్నారు.