traditional pinda pradanam
-
మహానేతపై చెరగని అభిమానం
తాడేపల్లిరూరల్ (పెదకాకాని): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ తాడేపల్లి మండలం పాతూరు గ్రామస్తులు సర్పంచి మేరి వేణు ఆధ్వర్యంలో సోమవారం పాతూరు పుష్కరఘాట్లో ఆయనకు పిండప్రదానం చేశారు. ముందుగా వైఎస్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అర్చకుల సమక్షంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పిండప్రదానం చేశారు. ఈ సందర్భంగా రైతుసంఘం నాయకుడు వజ్రాల నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీలు చేసిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. ఆ మహానుభావుడి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ పిండప్రదాన కార్యక్రమం చేసినట్టు చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని పేరుతో భూములు లాక్కుని రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పుష్కరఘాట్లకు పసుపు రంగులు వేయడం, పార్టీ బ్యానర్లు పెట్టి భోజనాలు పెట్టడం తదితరాలతో పుష్కరాలను రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు రెడ్డిబత్తుల సత్యనారాయణరెడ్డి, గ్రామపార్టీ అధ్యక్షుడు ఈశ్వరరెడ్డి, ఎస్సీసెల్ కన్వీనర్ మరియబాబు, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణగోపాలస్వామిరెడ్డి, నాయకులు కత్తిక రాఘవరావు, పాటిబండ్ల కృష్ణమూర్తి, పాతూరి రాజు, రవిచంద్ర, నల్లపు సుదర్శనం, రెడ్డిబత్తుల రాజారెడ్డి, ప్రతాపరెడ్డి, వైఎస్సార్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. -
రైతు ఆత్మలకు శాంతి క్రతువు
ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు రాజ్యసభ మాజీ సభ్యుడు శివాజీ పిండప్రదానం అమరావతి (గుంటూరు రూరల్) : అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారి ఆత్మలకు శాంతి చేకూరేందుకు సామూహిక పిండ ప్రదానం చేస్తున్నామని రైతు నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి శివాజీ తెలిపారు. అమరావతిలోని ధ్యాన బుద్ధ ఘాట్లో సోమవారం ఆయన పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం గతంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా లక్షా యాభై వేల మంది, రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది రైతులు ఇప్పటివరకూ ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వ్యవసాయంలో నష్టాలు రావడం ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం వల్ల ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయన్నారు. రైతులను ప్రభుత్వాలు ఎల్లప్పుడూ ఆదుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం సమాజంలో మానవతా విలువలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో గతంలో ఒక బిచ్చగాడు చనిపోతే స్థానిక బిచ్చగాళ్లు అతనికి కర్మకాండలు నిర్వహించి, ఆరోజు బిచ్చమెత్తుకునేందుకు సమ్మెను ప్రకటించారని తెలిపారు. వారికున్న మానవత్వం మనకులేదా అని ప్రశ్నించారు. అడవిలో ఒక జంతువుకు ఏదైనా ప్రమాదం జరిగితే మిగిలిన జంతువులు వేరే జంతువును అక్కడకు రాకుండా కాపు కాస్తాయని వాటికున్న ఐక్యత కూడా మానవులకు లేకుండా పోతోందన్నారు. ప్రభుత్వాలు రైతులను పట్టించుకోకుంటే ఉపద్రవం తప్పదన్నారు. రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలుతాయన్నారు. అనంతరం సామూహిక పిండ ప్రదానం చేశారు. కార్యక్రమంలో భారత రైతు సమాఖ్య, అవగాహన, తదితర సంస్థల సభ్యులు పాల్గొన్నారు. -
అభిమాన నేతకు పిండ ప్రదానం
కస్తల (అచ్చంపేట): మండలంలోని కస్తల పుష్కర ఘాట్లో వైఎస్సార్సీపీ జిల్లా సేవాదళ్ కార్యదర్శి షేక్ మీరావలి ఆదివారం దివంగత ముఖ్య మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదానం చేశారు. వైఎస్సార్ చిత్ర పటాన్ని ఒక చేత పట్టుకుని, మరో చేత్తో పిండాలు పట్టుకుని కృష్ణా నదిలో దిగి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహానేతపై తన అభిమానాన్ని చాటుకున్నారు.