కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో...
ఆదివారం ఉదయం నుంచి అమలు
విజయవాడ సిటీ(కృష్ణా): విజయవాడ కనకదుర్గ గుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకొని 9వ నంబర్ జాతీయ రహదారిపై వచ్చే భారీ వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లిస్తున్నారు. జాతీయ రహదారిపై సీతమ్మవారి పాదాల నుంచి భవానీపురం లారీ స్టాండ్ వరకు ఫై ్లఓవర్ నిర్మాణం కోసం శనివారం పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ మీదుగా 9వ నంబర్ జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను మళ్లిస్తున్నట్టు పోలీసు కమిషనర్ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి వాహనాల మళ్లింపు నిబంధనలు అమలులోకి వస్తాయని సీపీ పేర్కొన్నారు.
- హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, కోల్‌కత్తా వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట మీదుగా ఖమ్మం-సత్తుపల్లి, అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం, గోపాలపురం, దేవరపల్లి మీదుగా రాజమండ్రి వైపు, చిల్లకల్లు నుంచి వైరా మీదుగా తల్లాడ, సత్తుపల్లి, అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం, గోపాలపురం, దేవరపల్లి న్యూ బ్రిడ్జి మీదుగా రాజమండ్రి వైపు మళ్లించారు.
- హైదరాబాద్ నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను నార్కెట్‌పల్లి వద్ద మళ్లించి నల్గొండ మీదుగా మిర్యాలగూడ, దాచేపల్లి, పిడుగురాళ్ల, అద్దంకి మీదుగా ఒంగోలు వైపు మళ్లించారు.
- చెన్నై నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను మేదరమెట్ల జంక్షన్ వద్ద మళ్లించి అద్దంకి, పిడుగురాళ్ల, దాచేపల్లి, మిర్యాలగూడెం, నల్గొండ మీదుగా నార్కెట్ పల్లి నుంచి హైదరాబాద్ మళ్లించనున్నారు.
- విశాఖ వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను దివాన్‌చెరువు మీదుగా న్యూ బ్రిడ్జి, దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, ఖమ్మం, సూర్యారావుపేట మీదుగా హైదరాబాద్ వైపు, గుండుగొలను మీదుగా పంగిడిగూడెం, కామవరపుకోట, అశ్వారావుపేట, వైరా మీదుగా ఖమ్మం వైపు, హనుమాన్‌జంక్షన్ మీదుగా నూజివీడు, ఇబ్రహీంపట్నం, సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వైపు మళ్లిస్తున్నారు.
- గుంటూరు, తెనాలి, మంగళగిరి, బాపట్ల నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను పేరేచర్ల మీదుగా సత్తెనపల్లి, పిడుగురాళ్ల నుంచి మళ్లించనున్నారు.