
చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్ జామ్...
హైదరాబాద్: వారాంతం కావడంతో గోదావరి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. రద్దీ రెట్టింపవడంతో... ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. సరిపడా బస్సులు, రైళ్లు లేకపోవడంతో భక్తులు ఇబ్బందిపడుతున్నారు. తెలంగాణలో భద్రాచలం, మణుగూరు పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. ఇక కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లేవారు కూడా ట్రాఫిక్ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులతో పుష్కరాలకు వెళ్లే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు. ఓ దశలో పోలీసులపై పుష్కరాలకు వెళ్లే వాహనదారులు తిరగబడే పరిస్థితి కనిపించింది.
ఇక చొప్పదండి నుంచి ధర్మారం చేరుకునేందుకు సుమారు 6 గంటల సమయం పడుతుందని పుష్కరాలకు వెళ్లేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దమొత్తంలో ట్రాఫిక్ జామ్ అయినా ఒక్క పోలీస్ కూడా కనిపించలేదని, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదని పుష్కరాలకు వెళ్లేవారు మండిపడుతున్నారు. తాము హైదరాబాద్ నుంచి ఉదయం 5.30గంటలకు బయల్దేరామని ఇప్పటివరకూ ఇంకా ధర్మపురి చేరుకోలేని పరిస్థితి నెలకొందని, వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయినట్లు ట్రాఫిక్లో చిక్కుకున్న రంగాచారి కుటుంబసభ్యులు 'సాక్షి'కి సమాచారం అందించారు.
కాగా ఇక పుష్కరాల సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని రహదారులపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో యుద్ధప్రతిపాదికన ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ, రేపు సెలవులు కావడంతో హైదరాబాద్ నుంచి గోదావరి పుష్కరాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఉప్పల్ నుంచి వరంగల్, ఖమ్మం వెళ్లే రహదారులు, జేబీఎస్ నుంచి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వెళ్లే రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
టోల్‌గేట్ల వద్ద వాహనాలను ఎక్కువసేపు ఆపకుండా త్వరగా పంపేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలు మళ్లించాలని అధికారులకు సూచించారు. భక్తుల రద్దీ అధికమవుతున్న నేపథ్యంలో పుష్కరఘాట్ల వద్ద పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతీ పుష్కరఘాట్ వద్ద మంచి నీటి సదుపాయం, వైద్య సదుపాయం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. పుష్కరఘాట్లలో 24గంటలపాటు గజ ఈతగాళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.