pushkaraalu
-
పాలమూరుకు పుష్కర శోభ
నేడు ప్రారంభం కానున్న పుష్కరాలు స్నానాలతో తరలించేందుకు రానున్న భక్తులు ఘాట్ల వీఐపీలు, యాత్రికులకు మెరుగైనసేవలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కృష్ణా పుష్కరాలు వచ్చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న పుష్కరాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. కోట్లాది మంది భక్తుల పుణ్యస్తానాలకు పాలమూరు వేదిక కానుంది. అందుకోసం జిల్లా అధికార యంత్రాగం అన్ని చర్యలు చేపట్టింది. 12రోజుల పాటూ పుష్కరాలను వైభవంగా నిర్వహించి పాలమూరు ప్రత్యేకతను ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో ఏర్పాట్లుచేశారు. శుక్రవారం ఉదయం 6గంటలకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు కుటుంబసభ్యులతో కలిసి పుష్కరస్నానం అనంతరం పుష్కరాలను ప్రారంభించనున్నారు. – మహబూబ్‌నగర్ న్యూటౌన్ కృష్ణాపుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారయంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది. ఇప్పటికే పోలీస్, సాధారణ పరిపాలనతో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఆయా ఘాట్లను ముస్తాబు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి 2.5కోట్ల మంది యాత్రికులు జిల్లాకు వచ్చి పుష్కర స్నానాలు చేయనున్నారని ప్రభుత్వం అంచనావేస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారయంత్రాంగం రెండునెలల నుంచే ఏర్పాట్లలో నిమగ్నమైంది. ట్రాఫిక్ నియంత్రణ, వీఐపీ ప్రొటోకాల్, దారి వెంట సూచికబోర్డులు, ఘాట్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ, బారికేడ్లు, పార్కింగ్ స్థలాలు, గజ ఈతగాళ్లు.. తదితర ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని యాత్రికులకు మంచి అనుభూతిని మిగిల్చేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. భక్తులకు సేవలందించేందుకు 23,341మంది ఉద్యోగులు, సిబ్బందికి ఆయా ఘాట్లవారీగా విధులు కేటాయించారు. విపత్తు నివారణ సిబ్బంది 43, 1060మంది గజ ఈతగాళ్లను ప్రభుత్వం అదనంగా కేటాయించింది. పుష్కరాల నిర్వహణ బాధ్యతను కలెక్టర్ టీకే శ్రీదేవి ప్రత్యేకాధికారులకు అప్పగించారు. తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాటు జిల్లాలో ఏర్పాటుచేసిన 25 ప్రధాన, 27 స్థానిక ఘాట్ల వద్ద వైద్యసేవలు అందించేందుకు 636 మంది వైద్యసిబ్బంది బాధ్యలు నిర్వహిస్తున్నారు. మూడు ఘాట్ల వద్ద 10 పడకల ఆస్పత్రులు, అన్ని ప్రధానఘాట్ల వద్ద నాలుగు పడకల వైద్యసేవలను అందుబాటులో ఉంచారు. స్థానిక ఘాట్ల వద్ద 104 సర్వీసుల ద్వారా వైద్యసేవలు అందించనున్నారు. స్పెషలిస్టు డాక్టర్లతో పాటు 152 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుబాటులో గజ ఈతగాళ్లు కృష్ణానదిలో నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని మత్స్యశాఖ ఆధ్వర్యంలో 52 పుష్కరఘాట్ల వద్ద 1060 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. కృష్ణానది పాలమూరు జిల్లాలో 290 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఘాట్ల వద్ద ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. విపత్తు నివారణకు చర్యలు కృష్ణా పుష్కరాలకు యాత్రికుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని అనుకోని సంఘటనలు జరిగినప్పుడు సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం విపత్తి నివారణ బృందాన్ని రంగంలోకి దించింది. విపత్తు నివారణ కోసం 43మంది సిబ్బంది జిల్లాకు చేరుకున్నారు. అంతేకాకుండా తొక్కిసలాట, అనుకోని సంఘటనలు జరుగకుండా ముందస్తుగా ప్రధానమైన పుష్కరఘాట్ల వద్ద యాత్రికులకు కల్పించే ఏర్పాట్లపై వలంటర్లు, స్వచ్ఛంద సంస్థల సేవకులకు శిక్షణ ఇచ్చారు. రెవెన్యూ సిబ్బంది కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వహించేందుకు 1583 మంది రెవెన్యూ సిబ్బందిని కేటాయించారు. వీరంతా యాత్రికులకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా వీఐపీ ప్రొటోకాల్, భోజన సదుపాయాల కల్పనకు 161మంది సిబ్బందిని సిద్ధంచేశారు. భద్రతా ఏర్పాట్లు పుష్కరాలను విజయవంతం చేయడంలో పోలీసుల పాత్ర ప్రధానమైంది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాలోని 52 పుష్కర ఘాట్ల వద్ద భద్రత కల్పించేందుకు 7033 మంది పోలీసుసిబ్బంది అందుబాటులో ఉంచారు. పారిశుధ్య సిబ్బంది, కార్మికులు ఘాట్ల వద్ద పారిశుద్ధ్య చర్యలు చేపట్టేందుకు 52ఘాట్ల వద్ద 931మంది సిబ్బంది, కార్మికులు 3868మంది సిద్ధంగా ఉన్నారు. ఆయా ఘాట్లలో ప్రతీ గంటకోసారి పారిశుద్ధ్య పనులు నిర్వహించనున్నారు. అందుకోసం డస్ట్ బిన్లు, పాలిథిన్ కవర్లను సిద్ధంగా ఉంచారు. రాత్రి ఘాట్‌ను మూసివేసే సమయానికి పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపడతారు. అందుబాటులో వలంటీర్లు కృష్ణా పుష్కరాల్లో యాత్రికులకు సేవలు అందించేందుకు 6538మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. ప్రధానఘాట్లలో యాత్రికులకు వలంటీర్లు దగ్గరుండి సేవలందిస్తారు. విద్యుత్‌శాఖ ఆద్వర్యంలో 44 మంది సిబ్బంది ఆయా ఘాట్ల వద్ద సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంచారు. విద్యుత్ అంతరాయం, విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రధానమైన 25ఘాట్ల వద్ద 284మంది, స్థానిక ఘాట్ల వద్ద 57మంది అందుబాటులో ఉన్నారు. యాత్రికులకు సేవలందించేందుకు ఇతర శాఖలు, అనుబంధ సంస్థల నుంచి 427మంది ఉద్యోగులు, సిబ్బందిని సన్నద్ధం చేశారు. – కృష్ణానది నీటిలో మునిగిపోయిన రేవులపల్లి పుష్కర ఘాట్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో రేవులపల్లి ఘాట్‌కు విధులు కేటాయించిన సిబ్బందిని ఇతర చోట్ల విధులు అప్పగించే అవకాశం ఉంది. -
భక్తులకు అసౌకర్యం కలగనీయం
ఐటీడీఏ పీఓ రాజీవ్ భద్రాచలం: అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా భద్రాచలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా ఐటీడీఏ పీఓ, ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే సున్నం రాజయ్య, దేవస్థాన ఈఓ టి.రమేష్‌బాబుతో కలిసి పుష్కరాల ప్రారంభ పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానఘాట్ వద్దనే భక్తులు స్నానమాచరించాలని, లోతు ప్రదేశాలకు వెళ్లొద్దని సూచించారు. బారీకేడ్లను ఏర్పాటు చేశామని, నీటి పారుదల శాఖ, అగ్నిమాపక శాఖ పర్యవేక్షణలో ప్రమాదాలు జరగకుండా అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. భక్తులకు పూజా సామగ్రిని అందుబాటులో ఉంచుతున్నామని, అంతా ఆధ్యాత్మిక భావంతో పుష్కర స్నానాలు ఆచరించి ప్రశాంతంగా తిరిగి వెళ్లాలని, రాములోరిని దర్శించుకొని పునీతులు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ భాస్కరన్, తహసీల్దార్ రామకష్ణ, సర్పంచ్ బి.శ్వేత, దేవస్ధానం ఏఈఓ శ్రావణ్ కుమార్, ప్రధాన అర్చకులు జగన్నాథాచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పుష్కర పనులు నిష్ఫలం
నిధులు నీళ్లపాలు నాసిరకం పనులు కుంగిపోతున్న ట్యాంకులు 'పుష్కర పనుల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. బిల్లులు నిలిపివేస్తాం. కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెడతాం' ఇవీ పదేపదే మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ నోటి వెంట వచ్చిన హెచ్చరికలు. ఆదరాబాదరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చినా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలాయి. నాణ్యత లోపించి నీళ్లట్యాంకులు కుంగిపోయాయి. భూములోకి కూరుకుపోతున్నాయి. - కరీంనగర్ (ధర్మపురి) : పుష్కర సంబరాల హోరు మరిచిపోనేలేదు. పుష్కర ఏర్పాట్లలో భాగంగా చేపట్టిన పనులు నాణ్యతాలోపంతో వెక్కిరిస్తున్నాయి. ధర్మపురి సోమవిహార్ పుష్కరఘాట్ వద్ద కుంగిపోయిన నీటిట్యాంక్, నెర్రెలుబారిన సీసీరోడ్లు నాణ్యతలోపానికి సాక్షిగా నిలుస్తున్నాయి. ఏళ్ల తరబడి ఉండాల్సిన నిర్మాణాలు పట్టుమని పది రోజులకే కూలే దశకు చేరుకున్నాయి. రూ. కోటితో తాగునీటి ట్యాంక్‌లు ధర్మపురికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తాగునీటి సమస్య తీర్చేందుకు రూ.కోటితో తాగునీటి ట్యాంక్‌లు నిర్మించారు. పుష్కర భక్తులతోపాటు పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. పుష్కరాలకు నెలల ముందుగానే నిధులు విడుదల చేసిన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నత్తనడకన సాగాయి. పుష్కరాలు దగ్గరపడడంతో ఆదరాబాదరగా చేసేశారు. ధర్మపురితోపాటు రాయపట్నం, తిమ్మాపూర్ గ్రామాల్లో దాదాపు 30 వరకు తాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. ధర్మపురిలో 20 వేల లీటర్ల సామర్థ్యం గల 20 ట్యాంకులు ఏర్పాటు చేశారు. ఒక్కోదానికి రూ.2.60 లక్షలతో పనులు చేపట్టారు. వీటితో పాటు రాయపట్నం, తిమ్మాపూర్ గోదావరి తీరాలలో 5 వేల లీటర్ల సామర్థ్యం గల 10 చిన్నట్యాంకులను ఏర్పాటు చేశారు. ఒక్కోదానికి రూ.60 వేలు వ్యయం చేశారు. కుంగుతున్న ట్యాంకులు తాగునీటి ట్యాంకులు చూసేందుకు అందంగానే కనిపిస్తున్నాయి. పుష్కరాలు ముగిసి పది రోజులు కాలేదు. ట్యాంకులు నేలకు కుంగిపోతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో భూమి మెత్తబడి ట్యాంకులు ఒకవైపు వంగి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ధర్మపురి సంతోషిమాత, మంగలిగడ్డ, సోమవిహార్ ఘాట్ల వద్ద 30 ట్యాంకుల్లో 9 ఇక్కడే ఏర్పాటు చేశారు. 20 వేల లీటర్ల సామర్థ్యం గల 9 ట్యాంకులు గోదావరి ఒడ్డున నిర్మించారు. వాటిలో ప్రస్తుతం మూడు ట్యాంకులు భూమిలో కుంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. పెద్దట్యాంకులకు రూ.2.60 లక్షలు, చిన్నట్యాంకులకు రూ.60 వేలు వెచ్చించారు. కమీషన్ల పర్వం పుష్కరాల పనుల్లో నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఒక్కరూ పనుల వద్ద కనిపించలేదు. కమీషన్లకు కక్కుర్తిపడి గుత్తేదారులు సబ్‌కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పడంతో పనులు ఇలా మారారుు. నాణ్యతాలోపంతో వెక్కిరిస్తున్న ట్యాంకుల పరిస్థితిపై ఎవరూ సమాధానం చెబుతారోనని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
చివరి అంకం.. కావాలి అప్రమత్తం
పుష్కరాల ముగింపు.. రేపు, ఎల్లుండి పోటెత్తనున్న భక్తులు ముందస్తు చర్యలు చేపట్టకపోతే ఇబ్బందులే.. బాసరలో శోభాయమానంగా ముగింపు ఉత్సవం? సీఎం కేసీఆర్ జిలా పర్యటనపై సందిగ్ధత సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పుష్కరాలు చివరి అంకానికి చేరకున్నాయి. శనివారం సూర్యాస్తమయంతో పుష్కరాలు ముగియనున్నాయని వేదపండితులు పేర్కొంటున్నారు. పుష్కర స్నానాలు చేసేందుకు కేవలం రెండు రోజులే మిగిలి ఉండటంతో శుక్ర, శనివారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ముఖ్యంగా బాసర, సోన్, మంచిర్యాల వంటి ప్రధాన ఘాట్లకు తాకిడి పెరగనుంది. భక్తుల ర ద్దీని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టడం తప్పనిసరి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బాసర, సోన్, మంచిర్యాల, చెన్నూరు వంటి చోట్ల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు తప్పనిసరి. బుధవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఘాట్లు బురదమయంగా తయారయ్యాయి. బాసర ఘాట్ వద్ద ఉండిపోయిన మ ట్టిదిబ్బలపై జారి పడకుండా ఇసుక బస్తాలు వేయడం వంటి ఏర్పాట్లు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోం ది. వర్షానికి బాసర ఆలయం మెట్ల వద్ద వర్షం నీటికి జారిపడి హైదరాబాద్‌కు చెందిన వరలక్ష్మి అనే మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను వెంటనే నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఇలాం టి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. చాలాచోట్ల షవర్లు పనిచేయడం లేదు. బురద పైపుల్లో ఇరుక్కుపోయి నీళ్లు రావడం లేదు. వెంటనే వీటి మరమ్మతు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పారిశుధ్యం విషయంలో పంచాయతీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా హోటళ్లలో శుభ్రమైన ఆహారం విక్రయించేలా తనిఖీలు చేపట్టని పక్షంలో భక్తుల ఆరోగ్యం ప్రశ్నార్థంగా మారనుంది. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఉచిత బస్సుల సంఖ్యను పెంచుతున్నా, అవి ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రతి ట్రిప్పులోనూ కిక్కిరిసిపోతోంది. రెండు రోజులు మరింత రద్దీ పెరగనుండటంతో ఆ మేరకు బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాత్రి వేళల్లో వచ్చీవెళ్లే రైళ్ల సమయానికి తగ్గట్టుగా ట్రిప్పులను పెంచాలని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా భక్తులు తరలివస్తే తోపులాట జరగకుండా చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. అలాగే ఆలయంలో కూడా క్యూలైన్ల క్రమబద్ధీకరణ విషయంలో అప్రమత్తంగా లేనిపక్షంలో ఇబ్బందులు ఎదురుకానున్నాయి. మంచిర్యాల సమీపంలోని ముల్కల్ల ఘాట్‌కు కేవలం వందల్లోనే భక్తులు వచ్చే అవకాశాలున్నాయని ముందు గా అంచనా వేశారు. ఈ అంచనాలు తారుమారయ్యాయి. నిత్యం వేలల్లో భక్తులు వస్తుండడంతో ఈ ఘాట్‌ను ఉన్నఫలంగా విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. అవి తొందరగా పూర్తయ్యేలా చూడాలి. సౌకర్యాలపై కలెక్టర్ జగన్మోహన్ స్పందిస్తూ.. శుక్ర, శనివారాల్లో పెరగనున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు చేపట్టాం. పుష్కర విధులు నిర్వర్తిస్తున్న అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాం. బాసరలో ఉచిత బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా, రాత్రివేళల్లో వచ్చే రైళ్ల సమయానికి ఈ బస్సులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశాం. సీఎం కేసీఆర్ పర్యటన డౌటే..? పుష్కరాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లాలో పర్యటిస్తారని అం దరూ భావించారు. పుష్కరాలు ముగిసేలోపు బాసరకు వచ్చే అవకాశాలున్నాయని అనుకున్నారు. మంత్రులూ ప్రకటించినా.. సీఎం పర్యటనపై సందిగ్ధం నెలకొంది. శోభాయమానంగా ముగింపు.. పుష్కరాల ముగింపు కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించాలని బాసర దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా గోదావరి హారతి నిర్వహించాలని భావిస్తున్నారు. ఆలయం నుంచి గోదావరి వరకు శోభాయాత్ర నిర్వహించాలని భావిస్తున్నారు. అనంతరం గోదావరి తల్లికి, సరస్వతీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయాలనే యోచనలో ఉన్నారు. -
'గో'దారులన్నీ జామ్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : గోదావరి మహా పుష్కరాలకు భక్తులు మళ్లీ పోటెత్తారు. మంగళవారం భక్తుల సంఖ్య కాస్త పలుచబడినప్పటికీ బుధవారం అనూహ్యంగా రద్దీ పెరిగింది. జిల్లావ్యాప్తంగా 30 లక్షల మంది భక్తులు పుష్కర స్నానమాచరించారు. భక్తుల తాకిడి పెరగడంతో ప్రధాన పుష్కర ఘాట్ల ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహక్షేత్రానికి వెళ్లే భక్తులు 20 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. కాళేశ్వరంలోనూ 17 కి.మీ., కోటిలింగాల ప్రాంతంలో 12 కి.మీ. మేర ట్రాఫిక్ జాం అయ్యింది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీస్ యంత్రాంగం చెమటోడ్చింది. చాలాచోట్ల వాహనాలను వన్‌వేలోనే అనుమతిస్తున్నారు. వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సి రావడంతో సాధారణ రోజుల్లో కరీంనగర్ నుంచి ధర్మపురికి వెళ్లడానికి గంటన్నర సమయం పడుతుండగా, బుధవారం 5 గంటలకుపైగా పట్టింది. కాళేశ్వరంలోనూ ఇదే పరిస్థితి. మహదేవ్పూర్ నుంచి కాళేశ్వరం వరకు 17 కిలోమీటర్లకు నాలుగు గంటల సమయం పట్టింది. కోటిలింగాలకు వెళ్లే వాహనాలు వెల్గటూర్ నుంచి 12 కిలోమీటర్ల మేర స్తంభించాయి. దైవ దర్శనాలకు సైతం గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సివచ్చింది. మరో మూడు రోజులు జరిగే పుష్కరాలకు భక్తుల తాకిడి ఇలాగే ఉండే అవకాశముండడంతో ట్రాఫిక్, దర్శనాలకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. జనమే.. జనం ధర్మపురికి జనప్రవాహం పోటెత్తింది. మధ్యాహ్నం 3 గంటల వరకే 8.25 ల క్షల మంది భక్తులు పుష్కర స్నానమాచరించారు. ఎటు చూసినా జనసంద్రమే కనిపించింది. భక్తుల తాకిడితో రాయపట్నం, జగిత్యాల రూట్లలో ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్రమయ్యాయి. వేలాది సంఖ్యలో వాహనాలు రావడంతో 20 కిలోమీటర్ల నిలిచిపోయాయి. భక్తులు ధర్మపురి చేరుకునేందుకు నానాపాట్లు పడ్డారు. డీజీపీ అనురాగ్‌శర్మ, సీఎం ముఖ్యకార్యదర్శి స్మితా సభర్వాల్ ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం రాక సందర్భంగా హెలిప్యాడ్ పరిశీలించారు. గోదావరి నీటి మట్టం పెరగడంతోపాటు రద్దీ ఎక్కువ కావడంతో స్నానఘట్టాల వద్దకు వాహనాలు రాకుండా పోలీసులు కట్టడి చేశారు. చాలా మంది షవర్ల వద్ద స్నానాలు చేశారు. వీఐపీ ఘాట్‌ను బుధవారం రోడ్డు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, రాజ్యసభ మాజీ సభ్యుడు గిరీష్ సంఘీ, హీరో సంపూర్ణేశ్‌బాబు పుష్కర స్నానాలు చేశారు. కోటిలింగాలకు వచ్చే భక్తుల వాహనాలు వెల్గటూర్ నుంచి 12 కిలోమీటర్ల వరకు పూర్తిగా స్తంభించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు ఇదే పరిస్థితి. కోటిలింగాల కోటేశ్వర ఆలయానికి ప్రత్యేక దర్శనం ద్వారా రూ.20 లక్షల ఆదాయం చేకూరింది. 9వ రోజు కోటిలింగాలకు 2 లక్షలకుపైగా భక్తులు తరలివచ్చారు. కాళేశ్వరుడి దర్శనానికి 2 కిలోమీటర్ల క్యూ కాళేశ్వరం తొమ్మిదో రోజు జన ప్రవాహంగా మారింది. మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు కేవలం 17 కిలోమీటర్లు దూరం ఉండగా వాహనాల రద్దీతో నాలుగు గంటల సమయం పట్టింది. తిరుగు ప్రయాణంలో గంగారం మీదుగా వెళ్లిన భక్తులకు సైతం ట్రాఫిక్ సమస్య తప్పలేదు. సాధారణ దర్శనానికి రెండు కిలో మీటర్ల మేర క్యూలైన్లో భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా సాధారణ భక్తులకే జేసీ పౌసమిబసు ప్రాధాన్యత ఇచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు 8 లక్షల పైచిలుకు భక్తులు పుణ్య స్నానం ఆచరించారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీలు మందా జగన్నాథం, వివేక్ తదితరులు పుష్కరస్నానమాచరించారు. మంథనిలో రెండు లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. జిల్లా జడ్జి నాగమారుతిశర్మ పుష్కర స్నానం చేశారు. గోదావరిఖని వద్ద గల రెండు పుష్కరఘాట్లలో 70 వేల మంది పుణ్యస్నానాలు చేశారు. గోదావరి ఒడ్డున మట్టితో తయారు చేసిన లక్ష లింగార్చన పూజల్లో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పాల్గొన్నారు. సుందిల్ల దేవస్థానం వద్ద గల పుష్కరఘాట్‌లో సింగరేణి సంస్థ మాజీ సీఎండీ, గవర్నర్ సలహాదారు ఏపీజీఎన్ శర్మ పుష్కర స్నానాలు చేశారు. -
చిల్లర వేట
తూర్పుగోదావరి: పుష్కరాల సందర్భంగా ఘాట్లలో గోదావరికి భక్తులు సమర్పించే చిల్లర కోసం మత్య్సకార యువకులు నీటిలో నిరీక్షిస్తున్నారు. భక్తులు చిల్లర నాణేలు వేయగానే అది నీటి అడుగుకు వెళ్లకుండానే ఒడుపుగా పట్టుకుంటున్నారు. అయాస్కాంతాలతో కట్టిన ఒక తాడును నీటిలో వేసి నాణేలను తీస్తున్నారు. అలా కొన్ని నాణేలు వచ్చేదాకా పంటి కింద అదిమి పట్టుకుంటున్నారు. కొంత చిల్లర పోగయ్యాక ఒక సంచిలో అవి వేసుకుని పంటితో పట్టుకుని గట్టుకు వచ్చేస్తున్నారు. -
ఎంత అదృష్టం 'అప్పా'
తూర్పుగోదావరి జిల్లా: వారంతా శిక్షణ పొందుతున్న సబ్ఇన్స్పెక్టర్లు. శిక్షణ ముగియడానికి ఇంకా ఏడాది వ్యవధి ఉంది. ఈలోగా పుష్కరాల్లో విధుల్లో పాల్గొనాల్సి వచ్చింది. ఈ అరుదైన అవకాశం వారికి చెప్పలేనంత సంతోషం కలిగిస్తోంది. గోదావరి పుష్కరాల్లో సుమారు 1040 మంది ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమి (అప్పా)కి చెందిన ట్రైనీ ఎస్ఐలు సేవలందిస్తున్నారు. శిక్షణ పూర్తవకుండానే వచ్చిన తొలి పుష్కర విధులను సమర్థంగా నిర్వహించి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటామంటున్నారు వీరు. - కోటిలింగాల ఘాట్(రాజమండ్రి) ఎంతో అదృష్టం పోలీసు ఉద్యోగం అంటే చాలా ఇష్టం. త్వరలో సబ్ఇన్స్పెక్టర్గా ప్రజలకు సేవలందిస్తామన్న ఆనందంతో ఉన్న మాకు పుష్కరాల్లో విధులు నిర్వహించే అవకాశం రావడంతో చెప్పలేనంత ఆనందంగా ఉంది. -పి.రాంబాబు, ట్రైనీ ఎస్ఐ, నెల్లూరు మా భవితకు పునాది తొలి విధులు పుష్కరాలతో నిర్వహించడం జీవితంలో మరిచిపోలేని మధురానుభూతి. పుష్కరాల్లో తొలి అడుగు వేయడం మా పురోగతికి పునాదిగా మారుతుంది. - ఎ.విభూషణరావు, ట్రైనీ ఎస్ఐ, శ్రీకాకుళం -
చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్ జామ్...
-
చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్ జామ్...
హైదరాబాద్: వారాంతం కావడంతో గోదావరి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. రద్దీ రెట్టింపవడంతో... ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. సరిపడా బస్సులు, రైళ్లు లేకపోవడంతో భక్తులు ఇబ్బందిపడుతున్నారు. తెలంగాణలో భద్రాచలం, మణుగూరు పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. ఇక కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లేవారు కూడా ట్రాఫిక్ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులతో పుష్కరాలకు వెళ్లే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు. ఓ దశలో పోలీసులపై పుష్కరాలకు వెళ్లే వాహనదారులు తిరగబడే పరిస్థితి కనిపించింది. ఇక చొప్పదండి నుంచి ధర్మారం చేరుకునేందుకు సుమారు 6 గంటల సమయం పడుతుందని పుష్కరాలకు వెళ్లేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దమొత్తంలో ట్రాఫిక్ జామ్ అయినా ఒక్క పోలీస్ కూడా కనిపించలేదని, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదని పుష్కరాలకు వెళ్లేవారు మండిపడుతున్నారు. తాము హైదరాబాద్ నుంచి ఉదయం 5.30గంటలకు బయల్దేరామని ఇప్పటివరకూ ఇంకా ధర్మపురి చేరుకోలేని పరిస్థితి నెలకొందని, వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయినట్లు ట్రాఫిక్‌లో చిక్కుకున్న రంగాచారి కుటుంబసభ్యులు 'సాక్షి'కి సమాచారం అందించారు. కాగా ఇక పుష్కరాల సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని రహదారులపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో యుద్ధప్రతిపాదికన ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ, రేపు సెలవులు కావడంతో హైదరాబాద్ నుంచి గోదావరి పుష్కరాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఉప్పల్ నుంచి వరంగల్, ఖమ్మం వెళ్లే రహదారులు, జేబీఎస్ నుంచి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వెళ్లే రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. టోల్గేట్ల వద్ద వాహనాలను ఎక్కువసేపు ఆపకుండా త్వరగా పంపేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలు మళ్లించాలని అధికారులకు సూచించారు. భక్తుల రద్దీ అధికమవుతున్న నేపథ్యంలో పుష్కరఘాట్ల వద్ద పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతీ పుష్కరఘాట్ వద్ద మంచి నీటి సదుపాయం, వైద్య సదుపాయం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. పుష్కరఘాట్లలో 24గంటలపాటు గజ ఈతగాళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
పుష్కరాల్లో మరో అపశ్రుతి
తూర్పుగోదావరి: గోదావరి పుష్కరాల్లో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా గేదెల్లంక పుష్కరఘాట్‌లో శనివారం విషాదం చోటు చేసుకుంది. గేదెల్లంక వద్ద ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు చనిపోయారు. ఐదుగురు గాయపడ్డారు. ట్రాక్టర్ కింద మరింత మంది యాత్రికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతులు, గాయపడ్డవారు ఐనవిల్లి మండలం సేనపల్లిలంక గ్రామస్తులుగా గుర్తించారు. ట్రాక్టర్‌ను తొలగించేందుకు అధికారులు క్రేన్‌ను తెప్పిస్తున్నారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. గాయపడినవారిని చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'ఎన్టీఆర్ విగ్రహాన్ని వెంటనే తొలగించండి'
తూర్పుగోదావరి: రాజమండ్రి పుష్కరాల రేవు నుంచి ఎన్టీఆర్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్ చేశారు. పుష్కరాల రేవులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలన్నా సంకుచిత స్వభావం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ..పుష్కరాల రేవు వద్ద జరిగిన దుర్ఘటన ధార్మిక సంస్థల ఉత్సవాల్లో వచ్చిన నష్టం తప్ప..రాజకీయ వైఫల్యం కాదన్నారు. అందువల్ల సీఎం చంద్రబాబు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన అవసరంలేదన్నారు. కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్లే దుర్ఘటన జరిగినట్లు భావిస్తున్నానన్నారు. బతికున్నప్పుడు తల్లిదండ్రులకు అన్నంపెట్టని వాళ్లు పుష్కరాల్లో పిండ ప్రధానం చేస్తే ఏం లాభమన్నారు. ధార్మిక కార్యక్రమాల్లో రాజకీయనేతల ఓవరాక్షన్ ఎక్కువైందని నారాయణ విమర్శించారు. -
గోదావరి జిల్లాల పర్యటనకు చంద్రబాబు
హైదరాబాద్: గోదావరి పుష్కర పనులను పరిశీలించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. దీనిలో భాగంగా నేడు(శనివారం) ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉద్యోగ సంఘాలతో భేటి అనంతరం సీఎం గోదావరి పుష్కరాల పనులను పరిశీలించడానికి బయలుదేరారు. మంగళవారం నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పుష్కర పనులను ఆయన పరిశీలించనున్నారు. రాజమండ్రిలో సాయంత్రం వరకు పర్యటించి అధికారులతో సమీక్షించనున్నారు. ఆ తర్వాత కొవ్వురు వెళ్లనున్నారు. -
'ముహూర్తం' దాటింది..
మంచి తరుణం కోసం మరో నాలుగు నెలలు ఓ వైపు పుష్కరాలు.. మరోవైపు శూన్య మాసాలు, 'అధిక'ఆషాఢాలు.. ఇక అన్నీ మూఢాలే. మంచి తరుణం కోసం మరో నాలుగు నెలలు ఆగక తప్పదు. బుధవారం నుంచి ఎటువంటి శుభకార్యాల జోలికి వెళ్లవద్దని వేదపండితులు సూచిస్తున్నారు. ఇక శుభకార్యాలు బంద్ బాజాభజంత్రీలకు బ్రేక్ రేపటి నుంచి మూఢాలు ఖమ్మం : శుభ ముహూర్తాలు ముగిశాయి. మరో నాలుగు నెలల దాకా వివాహ, శుభకార్యాలు లేనట్టే. గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, నూతన పనుల ప్రారంభోత్సవాలకు తెరపడినట్టే. సుమారు 21రోజుల పాటు (మే 22 నుంచి జూన్ 11వ తేదీ వరకు) మేళ తాళాలు.. బాజాభజంత్రీలు.. విద్యుత్ దీపాల అలంకరణలు.. బంధు మిత్రులు.. బంగారు ఆభరణాలు.. వస్త్రాల కొనుగోళ్లతో సందడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చప్పబడింది. 17వ తేదీ నుంచి నాలుగు నెలల పాటు ఇక శుభ కార్యాల జోలే ఉండదు. ముగిసిన ముహూర్తాలు ఈ నెల 17 నుంచి శుభముహూర్తాలు ఉండవు. మంగళవారం అమావాస్య, బుధవారం నుంచి నిజ ఆషాఢం ప్రవేశిస్తుంది. ఇది జులై 16వ తేదీ వరకు ఉంటుంది. మళ్లీ జులై 17 నుంచి అధిక ఆషాఢమాసం ప్రారంభం అవుతుంది. ఆ తరువాత భాద్రపదమాసం, శూన్యమాసం, శుక్రమూఢమిలు వరుసగా వచ్చాయి. ఈ నెలల్లో శుభకార్యాలు తలపెట్టరు. దీనికితోడు గోదావరి పుష్కరాలు కూడా రావటంతో పుష్కరకాలంలో శుభకార్యాలు చేయకూడదు. పుష్కరాల సమయంలో పెద్దలకు తర్పణాలు వదలటం.. వాళ్ల పేరిట శివలింగాల ప్రతిష్ఠ వంటివి చేస్తారు కాబట్టి ఈ నాలుగు నెలలు శుభకార్యాలు నిర్వహించకూడదని పండితులు అభిప్రాయపడుతున్నారు. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల వరకు శూన్యమాసాలే ఉంటాయి. గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ఠలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల ముహూర్తాలు ఉండవు. ఇక ఈ నాలుగు నెలలు పెళ్లి మండపాలు మూగనోము పాటించాల్సిందే. కొత్తగా పెళ్లైన నవ వధువులు నెలరోజులు ఆషాఢమాసంలో పుట్టింటి వద్దనే ఉండటం సంప్రదాయం. మళ్లీ ఆశ్వయుజ మాసంలోనే... ఆశ్వయుజమాసం అక్టోబర్ 13వ తేదీ నుంచి ప్రవేశిస్తుంది. ఇది నెల రోజుల పాటు ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల వరకు ముహూర్తాలు ఉన్నాయి. జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు పుష్యమాసం రావటంతో ముహూర్తాలు ఉండవు. ఆ తరువాత ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మాగమాసం ప్రవేశిస్తుంది. అప్పటి నుంచి శుభముహూర్తాలు పుష్కలంగా ఉంటాయని వేదపండితులు తెలిపారు. పుష్కరాలు ముగిసేవరకు వరుసగా మూఢాలు, శూన్యమాసాలు, అధిక ఆషాఢ మాసాలు రావటం వలన నాలుగు నెల ల పాటు ముహూర్తాలు లేవు. జులై 14 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ సమయూల్లో ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు. - రామడుగు గురుప్రసాదాచార్యులు, వేదపండితులు