- నేడు ప్రారంభం కానున్న పుష్కరాలు
- స్నానాలతో తరలించేందుకు రానున్న భక్తులు
- ఘాట్ల వీఐపీలు, యాత్రికులకు మెరుగైనసేవలు
- విద్యుత్‌శాఖ ఆద్వర్యంలో 44 మంది సిబ్బంది ఆయా ఘాట్ల వద్ద సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంచారు. విద్యుత్ అంతరాయం, విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
- అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రధానమైన 25ఘాట్ల వద్ద 284మంది, స్థానిక ఘాట్ల వద్ద 57మంది అందుబాటులో ఉన్నారు. యాత్రికులకు సేవలందించేందుకు ఇతర శాఖలు, అనుబంధ సంస్థల నుంచి 427మంది ఉద్యోగులు, సిబ్బందిని సన్నద్ధం చేశారు.
- – కృష్ణానది నీటిలో మునిగిపోయిన రేవులపల్లి పుష్కర ఘాట్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో రేవులపల్లి ఘాట్‌కు విధులు కేటాయించిన సిబ్బందిని ఇతర చోట్ల విధులు అప్పగించే అవకాశం ఉంది.
పాలమూరుకు పుష్కర శోభ
Published Thu, Aug 11 2016 9:59 PM | Last Updated on Tue, Aug 28 2018 5:33 PM
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కృష్ణా పుష్కరాలు వచ్చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న పుష్కరాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. కోట్లాది మంది భక్తుల పుణ్యస్తానాలకు పాలమూరు వేదిక కానుంది. అందుకోసం జిల్లా అధికార యంత్రాగం అన్ని చర్యలు చేపట్టింది. 12రోజుల పాటూ పుష్కరాలను వైభవంగా నిర్వహించి పాలమూరు ప్రత్యేకతను ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో ఏర్పాట్లుచేశారు. శుక్రవారం ఉదయం 6గంటలకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు కుటుంబసభ్యులతో కలిసి పుష్కరస్నానం అనంతరం పుష్కరాలను ప్రారంభించనున్నారు.
– మహబూబ్‌నగర్ న్యూటౌన్
కృష్ణాపుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారయంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది. ఇప్పటికే పోలీస్, సాధారణ పరిపాలనతో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఆయా ఘాట్లను ముస్తాబు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి 2.5కోట్ల మంది యాత్రికులు జిల్లాకు వచ్చి పుష్కర స్నానాలు చేయనున్నారని ప్రభుత్వం అంచనావేస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారయంత్రాంగం రెండునెలల నుంచే ఏర్పాట్లలో నిమగ్నమైంది. ట్రాఫిక్ నియంత్రణ, వీఐపీ ప్రొటోకాల్, దారి వెంట సూచికబోర్డులు, ఘాట్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ, బారికేడ్లు, పార్కింగ్ స్థలాలు, గజ ఈతగాళ్లు.. తదితర ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని యాత్రికులకు మంచి అనుభూతిని మిగిల్చేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. భక్తులకు సేవలందించేందుకు 23,341మంది ఉద్యోగులు, సిబ్బందికి ఆయా ఘాట్లవారీగా విధులు కేటాయించారు. విపత్తు నివారణ సిబ్బంది 43, 1060మంది గజ ఈతగాళ్లను ప్రభుత్వం అదనంగా కేటాయించింది. పుష్కరాల నిర్వహణ బాధ్యతను కలెక్టర్ టీకే శ్రీదేవి ప్రత్యేకాధికారులకు అప్పగించారు.
తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాటు
జిల్లాలో ఏర్పాటుచేసిన 25 ప్రధాన, 27 స్థానిక ఘాట్ల వద్ద వైద్యసేవలు అందించేందుకు 636 మంది వైద్యసిబ్బంది బాధ్యలు నిర్వహిస్తున్నారు.
మూడు ఘాట్ల వద్ద 10 పడకల ఆస్పత్రులు, అన్ని ప్రధానఘాట్ల వద్ద నాలుగు పడకల వైద్యసేవలను అందుబాటులో ఉంచారు. స్థానిక ఘాట్ల వద్ద 104 సర్వీసుల ద్వారా వైద్యసేవలు అందించనున్నారు. స్పెషలిస్టు డాక్టర్లతో పాటు 152 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.
అందుబాటులో గజ ఈతగాళ్లు
కృష్ణానదిలో నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని మత్స్యశాఖ ఆధ్వర్యంలో 52 పుష్కరఘాట్ల వద్ద 1060 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. కృష్ణానది పాలమూరు జిల్లాలో 290 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఘాట్ల వద్ద ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.
విపత్తు నివారణకు చర్యలు
కృష్ణా పుష్కరాలకు యాత్రికుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని అనుకోని సంఘటనలు జరిగినప్పుడు సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం విపత్తి నివారణ బృందాన్ని రంగంలోకి దించింది. విపత్తు నివారణ కోసం 43మంది సిబ్బంది జిల్లాకు చేరుకున్నారు. అంతేకాకుండా తొక్కిసలాట, అనుకోని సంఘటనలు జరుగకుండా ముందస్తుగా ప్రధానమైన పుష్కరఘాట్ల వద్ద యాత్రికులకు కల్పించే ఏర్పాట్లపై వలంటర్లు, స్వచ్ఛంద సంస్థల సేవకులకు శిక్షణ ఇచ్చారు.
రెవెన్యూ సిబ్బంది
కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వహించేందుకు 1583 మంది రెవెన్యూ సిబ్బందిని కేటాయించారు. వీరంతా యాత్రికులకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా వీఐపీ ప్రొటోకాల్, భోజన సదుపాయాల కల్పనకు 161మంది సిబ్బందిని సిద్ధంచేశారు.
భద్రతా ఏర్పాట్లు
పుష్కరాలను విజయవంతం చేయడంలో పోలీసుల పాత్ర ప్రధానమైంది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాలోని 52 పుష్కర ఘాట్ల వద్ద భద్రత కల్పించేందుకు 7033 మంది పోలీసుసిబ్బంది అందుబాటులో ఉంచారు.
పారిశుధ్య సిబ్బంది, కార్మికులు
ఘాట్ల వద్ద పారిశుద్ధ్య చర్యలు చేపట్టేందుకు 52ఘాట్ల వద్ద 931మంది సిబ్బంది, కార్మికులు 3868మంది సిద్ధంగా ఉన్నారు. ఆయా ఘాట్లలో ప్రతీ గంటకోసారి పారిశుద్ధ్య పనులు నిర్వహించనున్నారు. అందుకోసం డస్ట్ బిన్లు, పాలిథిన్ కవర్లను సిద్ధంగా ఉంచారు. రాత్రి ఘాట్‌ను మూసివేసే సమయానికి పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపడతారు.
అందుబాటులో వలంటీర్లు
కృష్ణా పుష్కరాల్లో యాత్రికులకు సేవలు అందించేందుకు 6538మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. ప్రధానఘాట్లలో యాత్రికులకు వలంటీర్లు దగ్గరుండి సేవలందిస్తారు.
Advertisement
Advertisement