వారాంతం కావడంతో గోదావరి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. రద్దీ రెట్టింపవడంతో... ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. సరిపడా బస్సులు, రైళ్లు లేకపోవడంతో భక్తులు ఇబ్బందిపడుతున్నారు. తెలంగాణలో భద్రాచలం, మణుగూరు పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. ఇక కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లేవారు కూడా ట్రాఫిక్ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులతో పుష్కరాలకు వెళ్లే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు. ఓ దశలో పోలీసులపై పుష్కరాలకు వెళ్లే వాహనదారులు తిరగబడే పరిస్థితి కనిపించింది.