'ముహూర్తం' దాటింది..
మంచి తరుణం కోసం మరో నాలుగు నెలలు
ఓ వైపు పుష్కరాలు.. మరోవైపు శూన్య మాసాలు, 'అధిక'ఆషాఢాలు.. ఇక అన్నీ మూఢాలే. మంచి తరుణం కోసం మరో నాలుగు నెలలు ఆగక తప్పదు. బుధవారం నుంచి ఎటువంటి శుభకార్యాల జోలికి వెళ్లవద్దని వేదపండితులు సూచిస్తున్నారు.
- ఇక శుభకార్యాలు బంద్
- బాజాభజంత్రీలకు బ్రేక్
- రేపటి నుంచి మూఢాలు
ఖమ్మం : శుభ ముహూర్తాలు ముగిశాయి. మరో నాలుగు నెలల దాకా వివాహ, శుభకార్యాలు లేనట్టే. గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, నూతన పనుల ప్రారంభోత్సవాలకు తెరపడినట్టే. సుమారు 21రోజుల పాటు (మే 22 నుంచి జూన్ 11వ తేదీ వరకు) మేళ తాళాలు.. బాజాభజంత్రీలు.. విద్యుత్ దీపాల అలంకరణలు.. బంధు మిత్రులు.. బంగారు ఆభరణాలు.. వస్త్రాల కొనుగోళ్లతో సందడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చప్పబడింది. 17వ తేదీ నుంచి నాలుగు నెలల పాటు ఇక శుభ కార్యాల జోలే ఉండదు.
ముగిసిన ముహూర్తాలు
ఈ నెల 17 నుంచి శుభముహూర్తాలు ఉండవు. మంగళవారం అమావాస్య, బుధవారం నుంచి నిజ ఆషాఢం ప్రవేశిస్తుంది. ఇది జులై 16వ తేదీ వరకు ఉంటుంది. మళ్లీ జులై 17 నుంచి అధిక ఆషాఢమాసం ప్రారంభం అవుతుంది. ఆ తరువాత భాద్రపదమాసం, శూన్యమాసం, శుక్రమూఢమిలు వరుసగా వచ్చాయి. ఈ నెలల్లో శుభకార్యాలు తలపెట్టరు. దీనికితోడు గోదావరి పుష్కరాలు కూడా రావటంతో పుష్కరకాలంలో శుభకార్యాలు చేయకూడదు. పుష్కరాల సమయంలో పెద్దలకు తర్పణాలు వదలటం.. వాళ్ల పేరిట శివలింగాల ప్రతిష్ఠ వంటివి చేస్తారు కాబట్టి ఈ నాలుగు నెలలు శుభకార్యాలు నిర్వహించకూడదని పండితులు అభిప్రాయపడుతున్నారు. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల వరకు శూన్యమాసాలే ఉంటాయి. గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ఠలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల ముహూర్తాలు ఉండవు. ఇక ఈ నాలుగు నెలలు పెళ్లి మండపాలు మూగనోము పాటించాల్సిందే. కొత్తగా పెళ్లైన నవ వధువులు నెలరోజులు ఆషాఢమాసంలో పుట్టింటి వద్దనే ఉండటం సంప్రదాయం.
మళ్లీ ఆశ్వయుజ మాసంలోనే...
ఆశ్వయుజమాసం అక్టోబర్ 13వ తేదీ నుంచి ప్రవేశిస్తుంది. ఇది నెల రోజుల పాటు ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల వరకు ముహూర్తాలు ఉన్నాయి. జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు పుష్యమాసం రావటంతో ముహూర్తాలు ఉండవు. ఆ తరువాత ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మాగమాసం ప్రవేశిస్తుంది. అప్పటి నుంచి శుభముహూర్తాలు పుష్కలంగా ఉంటాయని వేదపండితులు తెలిపారు.
పుష్కరాలు ముగిసేవరకు
వరుసగా మూఢాలు, శూన్యమాసాలు, అధిక ఆషాఢ మాసాలు రావటం వలన నాలుగు నెల ల పాటు ముహూర్తాలు లేవు. జులై 14 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ సమయూల్లో ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు.
- రామడుగు గురుప్రసాదాచార్యులు, వేదపండితులు