గుండె బరువుతో పాటకు సెలవు.. | Gaddar funeral with state honours | Sakshi
Sakshi News home page

గుండె బరువుతో పాటకు సెలవు..

Published Tue, Aug 8 2023 5:27 AM | Last Updated on Tue, Aug 8 2023 3:58 PM

Gaddar funeral with state honours - Sakshi

భారీ జనసందోహం మధ్య గద్దర్‌ అంతిమయాత్ర 

సాక్షి, సిటీబ్యూరో/అల్వాల్‌/ గన్‌పౌండ్రి: ప్రజా యుద్ధనౌక ఇక సెలవంటూ తరలివెళ్లింది. తన పదనునైన గళంతో, ఉర్రూతలూగించే పాటలతో అర్ధ శతాబ్దం పాటు యావత్‌ సమాజాన్ని ప్రభావితం చేసిన సాంస్కృతిక యోధుడు, ప్రజా గాయకుడు గద్దర్‌ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం అల్వాల్‌ భూదేవినగర్‌లో ఆయన స్థాపించిన మహాబోధి పాఠశాలలో ముగిశాయి. వేలాదిమంది అభిమానులు, వివిధ పారీ్టలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, కవులు, కళాకారులు, ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, కుటుంబసభ్యులు, బంధువులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు.

తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో క్రియాశీలమైన భూమికను పోషించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన వంతు కృషి చేసిన గద్దర్‌ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించింది. బౌద్ధమత సాంప్రదాయం ప్రకారం గద్దర్‌ తనయుడు సూర్య అంత్యక్రియల క్రతువును నిర్వహించారు. బౌద్ధమత గురువులు పంచశీల సూత్రాలను పఠించారు. అనంతరం గద్దర్‌ పార్థివదేహాన్ని సమాధి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూదేవినగర్‌లోని గద్దర్‌ నివాసానికి వచ్చి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. గద్దర్‌ భార్య విమలను, కుటుంబసభ్యులను పరామర్శించారు.

మంత్రులు మహమూద్‌ అలీ, హరీశ్‌రావు, తలసాని తదితరులు సీఎం వెంట ఉన్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కూడా అల్వాల్‌లో గద్దర్‌ భౌతికకాయానికి నివాళులర్పించి కు­టుంబ సభ్యులను ఓదార్చారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు దానం నాగేందర్, టి.రాజయ్య, జీవన్‌రెడ్డి, మంచు మోహన్‌బాబు, మనోజ్, అలీ, నాగబాబు, నిహారిక, పరుచూరి గోపాలకృష్ట, ఆర్‌.నారాయణమూర్తి, ప్రొఫె­సర్‌ కోదండరాం, జయప్రకాశ్‌ నారాయణ, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, అనగాని సత్యప్రసాద్, జనార్ధన్, పరిటాల శ్రీరామ్, వివేక్, మోత్కుపల్లి నరసింహులు తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. భూదేవినగర్, వెంకటాపురం ప్రజలతో పాటు రాష్ట్రం న­లు­మూలల నుంచి వేలాది­మంది తరలివచ్చి కన్నీటి నివాళులర్పించారు.  

అంత్యక్రియలకు ప్రముఖులు 
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎమ్మెల్యే సీతక్క, మధుయాష్కీ గౌడ్, వి.హనుమంతరావు, మల్లు రవి ,శ్రీధర్‌బాబు, మాభూమి చిత్ర దర్శకులు నర్సింగ్‌ రావు, ప్రముఖ సినీనటుడు ఆర్‌.నారాయణమూర్తి, తెలంగాణ ఉద్యమ నేత గాదె ఇన్నయ్య, జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్, విమలక్క, బీఆర్‌ఎస్‌ నేతలు మైనంపల్లి హనుమంతరావు, రసమయి బాలకిషన్, గోరటి వెంకన్న, బాల్క సుమన్, క్రాంతి, గెల్లు శ్రీనివాస్, పల్లె రవి, ఎమ్మార్పిఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, బీఎస్‌పీ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, జర్నలిస్టు పాశం యాదగిరి, వేదకుమార్, తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. 

దారంతా జన ప్రభంజనం 
తెలుగు ప్రజల సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన గద్దర్‌ అంతిమయాత్ర మహాజన ప్రభంజనాన్ని తలపించింది. ఎల్‌బీ స్టేడియం నుంచి అల్వాల్‌ వరకు రహదారులు జసందోహంతో పోటెత్తాయి. పోలీసుల గౌరవ వందనంతో అంతిమ యాత్ర ప్రారంభమైంది. అనారోగ్యంతో ఆదివారం కన్నుమూసిన గద్దర్‌ భౌతికకాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఎల్‌బీ స్టేడియంలో ఉంచిన సంగతి తెలిసిందే.

కాగా మధ్యాహ్నం 12 గంటలకు ఎల్‌బీ స్టేడియం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర గన్‌పార్క్, ట్యాంక్‌బండ్‌ (అంబేడ్కర్‌ విగ్రహం), సికింద్రాబాద్‌ మీదుగా సాయంత్రం 4 గంటలకు అల్వాల్‌కు చేరుకుంది. వాహనానికి జై భీం జెండాలతో పాటు బుద్దుడి పంచశీల జెండాలను ఏర్పాటు చేశారు. గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద కళాకారులు పాటలతో శ్రద్ధాంజలి ఘటించారు. గద్దర్‌ పార్థివదేహాన్ని ఉంచిన వాహనానికి ముందు, వెనుక వేలాదిగా కదిలివచ్చిన అభిమానులు ‘అమర్‌ రహే గద్దర్‌’, ‘జోహార్‌ గద్దరన్న’ అంటూ ఇచ్చిన నినాదాలతో పరిసరాలు ప్రతిధ్వ­నించాయి. 

ఎల్‌బీ స్టేడియంలో ఘన నివాళులు 
ఎల్‌బీ స్టేడియంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో గద్దర్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, మాజీ మంత్రి జానారెడ్డి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.  

ప్రత్యేక వేదికలు.. కటౌట్‌లు 
గద్దర్‌ను చివరిసారి చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. ఎక్కడికక్కడ వాహనాన్ని నిలిపివేసి ఆయన భౌతికకాయానికి నమస్కరిస్తూ నివాళులర్పించారు. సికింద్రాబాద్, జేబీఎస్, కార్ఖానా, తిరుమలగిరి, తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. దారి పొడవునా అక్కడక్కడా పెద్ద ఎత్తున గద్దర్‌ కటౌట్‌లను ఏర్పాటు చేశారు. ప్రజా నాట్యమండలి, జన నాట్యమండలి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు చెందిన కళాకారుల ఆట, పాటల నడుమ గద్దర్‌ అంతిమయాత్ర సాగింది.  

అంతిమయాత్రలో విషాదం 
సియాసత్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ కన్నుమూత 
గద్దర్‌ అంతిమయాత్ర సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. వివిధ రంగాల ప్రముఖులతో పాటు అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావడంతో అల్వాల్‌లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో చిక్కుకున్న సియాసత్‌ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీఖాన్‌ (63) తీవ్రమైన నీరసంతో జనంమధ్యలో పడిపోయారు. స్థానికులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కార్డియాక్‌ అరెస్టుతో చనిపోయినట్లు చెప్పారు. గద్దర్‌కు సన్నిహితుడైన జహీరుద్దీన్‌ ఆదివారం నుంచి ఆయన భౌతికకాయం వద్దే ఉన్నారు. 


సీఎం కేసీఆర్‌ సంతాపం  
సియాసత్‌ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీఖాన్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం ఉర్దూ పత్రిక ప్రపంచానికి తీరనిలోటన్నారు. పత్రికా సంపాదకుడుగా తెలంగాణ ఉద్యమంలో అలీఖాన్‌ పోషించిన పాత్ర, ఆయన సేవలను సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.  

  • జహీరుద్దీన్‌ అలీఖాన్‌ మృతి పట్ల బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ సంతాపం ప్రకటించారు. ఆయన ఉర్దూ పత్రికారంగానికి ఎనలేని సేవలు చేశారన్నారు. జహీరుద్దీన్‌ కుటుంబసభ్యులకు కేటీఆర్‌ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
  • జహీరుద్దీన్‌ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య సంతాపం తెలిపారు. 
  • జహీరుద్దీన్‌ అలీఖాన్‌ ఆకస్మిక మరణం పట్ల, మీడియా అకాడమీ చైర్మన్, అల్లం నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాతబస్తీ రాజకీయాల్లో ప్రముఖపాత్ర వహించి చెరగని ముద్ర వేశారని, దేశంలోని ఉర్దూ జర్నలిజానికి ఆయన మరణం తీరని లోటు అన్నారు.  
  • వ్యక్తిగతంగా జహీరుద్దీన్‌ అలీఖాన్‌తో తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉండేవని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గుర్తు చేసుకున్నారు. అతని కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని కలి్పంచాలని భగవంతుడిని కోరారు.  
  • జహీరుద్దీన్‌ మృతిపై ఇంకా ఏఐఎంఎస్‌ఎస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి సీహెచ్‌.ప్రమీల, ఏఐడీఎస్‌ఓ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్‌రాజ్, ఏఐడీవైఓ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి వై.నాగరాజు సంతాపం తెలిపారు.   

కలం.. గళం
24 గంటల్లోనే లోకాన్ని విడిచిన ఆప్తమిత్రులు ప్రజాయుద్ధనౌక గద్దర్, ‘సియాసత్‌’జహీరుద్దీన్‌  
సాక్షి, హైదరాబాద్‌: అవును వారిద్దరూ ఆప్తమిత్రులు... ఎన్నో ఆలోచనలు..మరెన్నో చర్చలు..ఇద్దరూ సమాజ శ్రేయస్సుకు కృషి చేసిన వారే.. 24 గంటల వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచివెళ్లారు. వారిలో ఒకరు తన ఆటాపాటతో విప్లవ, తెలంగాణ ఉద్యమాలకు ఊపిరిలూదితే.. మరొకరు పత్రిక ద్వారా మైనారిటీ, బడుగు బలహీనవర్గాల పక్షాన నిలిచారు. వారే ప్రజాయుద్ధనౌక గద్దర్‌ అలియాస్‌ గుమ్మడి విఠల్‌రావు.. మరొకరు సియాసత్‌ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీఖాన్‌. వారిద్దరూ సియాసత్‌ కార్యాలయంలో గంటల తరబడి చర్చల్లో మునిగితేలేవారు.

గద్దర్‌ వారానికోసారైనా సియాసత్‌ కార్యాలయానికి వెళ్లడం అక్కడ సామాజిక, రాజకీయ అంశాలే కాకుండా ప్రజానీకం సమస్యలపై తరచు చర్చలు సాగించేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ వీరిద్దరూ కీలకభూమిక పోషించారు. సియాసత్‌ తరఫున నిర్వహించే సామాజిక కార్యక్రమాలకు సంబంధించి జహీరుద్దీన్‌అలీఖాన్‌ గద్దర్‌తో చర్చించేవారు. గద్దర్‌ మరణించిన వార్త తెలిసి జహీరుద్దీన్‌ చలించిపోయారు. ఎల్‌బీ స్టేడియం నుంచి గద్దర్‌ అంత్యక్రియలు జరిగే అల్వాల్‌లోని వెంకటాపూర్‌ వరకు పార్థివదేహం వెళ్లిన వాహనంలోనే ఆయన వెళ్లారు. అక్కడ దిగిన తర్వాత గద్దర్‌ భౌతికకాయాన్ని తీసుకెళుతున్న సమయంలో ఒక్కసారిగా జనం తోపులాట ఎక్కువ కావడం, ఆ మధ్యలోనే జహీరుద్దీన్‌ పడిపోవడం, తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. దగ్గర్లోని ఆస్పత్రికి ఆయన్ను తరలించినా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.  

అందరివాడు గద్దర్‌
అన్ని రంగాలు, వర్గాలతో సన్నిహితంగా మెలిగిన ప్రజాగాయకుడు
సాక్షి, హైదరాబాద్‌: సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం..పీడిత వర్గాల తరఫున ప్రభుత్వాలను ప్రశ్నించిన గొంతు అది..పోలీసులు ఎక్కుపెట్టిన తుపాకులను సైతం లెక్క చేయక నిలబడి కొట్లాడిన గళం అది..అయినాసరే గద్దర్‌ అజాత శత్రువుగానే బతికారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడం అని ఎన్నోసార్లు తన విధానాన్ని సుస్పష్టం చేశారు. తన వ్యవహార శైలితో సమాజంలోని అన్ని వర్గాలకు దగ్గరయ్యారు. రాజకీయ పారీ్టలకతీతంగా ప్రముఖ నాయకులందరితోనూ సాన్నిహిత్యాన్ని సంపాదించారు.

కళాకారుడిగా, రచయితగా సినీరంగంతోనూ ఆయన అనుబంధం కొనసాగింది. గద్దర్‌ మరణ వార్తతో అన్ని రంగాల ప్రముఖులు, సామాన్యుల నుంచి అన్ని వర్గాల వారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక సోమవారం జరిగిన గద్దర్‌ అంతిమయాత్ర ఆసాంతం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పట్టింది. 1972 నుంచి 2012 వరకు నాలుగు దశాబ్దాల విప్లవ ప్రస్థానంలో పీడిత ప్రజల పక్షాన నిలబడ్డ గద్దర్‌ తన పాటలతో ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూదారు. ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాట గొంతుకగా నిలిచారు. నిక్కచ్చిగా మాట్లేడే తత్వమే గద్దర్‌కు ఎంతో మందిని దగ్గర చేసింది. మావోయిస్టు ఉద్యమాలకు దశాబ్దాలుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన అందించిన తోడ్పాటును గుర్తుచేస్తూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఓ లేఖ విడుదల చేసింది.

గద్దర్‌ మృతి తమను తీవ్రంగా బాధించిందని పేర్కొంది. మరోవైపు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఎన్నో సందర్భాల్లో ప్రశ్నించిన ప్రజాయుద్ధ నౌక అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వమే అధికార లాంఛనాలతో నిర్వహించింది. ఉద్యమ సమయంలో, అనేక ఎన్‌కౌంటర్ల సమయంలో పోలీసులతో ఎన్నో అంశాలపై కొట్లాడిన గద్దర్‌కు నివాళులర్పించేందుకు ఒకప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌ సజ్జనార్‌ సైతం వచ్చారు. గద్దర్‌తో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. సినీ ప్రముఖులు సైతం సంతాపం తెలిపారు. ఆయన అభిమానులు, తోటి రచయితలు, అంతిమయాత్రలో పాదం కలిపారు. మావోయిస్టు ఉద్యమంతో దశాబ్దాలు గడిపిన గద్దర్‌కు చివరి గడియల్లో పోలీసు తుపాకులు గౌరవ వందనం సమర్పించడం.. ఆయన అందరివాడన్న దానికి మరో నిదర్శనంగా నిలిచింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement