- పుష్కరాల ముగింపు.. రేపు, ఎల్లుండి పోటెత్తనున్న భక్తులు
- ముందస్తు చర్యలు చేపట్టకపోతే ఇబ్బందులే..
- బాసరలో శోభాయమానంగా ముగింపు ఉత్సవం?
- సీఎం కేసీఆర్ జిలా పర్యటనపై సందిగ్ధత
- బుధవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఘాట్లు బురదమయంగా తయారయ్యాయి. బాసర ఘాట్ వద్ద ఉండిపోయిన మ ట్టిదిబ్బలపై జారి పడకుండా ఇసుక బస్తాలు వేయడం వంటి ఏర్పాట్లు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోం ది. వర్షానికి బాసర ఆలయం మెట్ల వద్ద వర్షం నీటికి జారిపడి హైదరాబాద్‌కు చెందిన వరలక్ష్మి అనే మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను వెంటనే నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఇలాం టి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.
- చాలాచోట్ల షవర్లు పనిచేయడం లేదు. బురద పైపుల్లో ఇరుక్కుపోయి నీళ్లు రావడం లేదు. వెంటనే వీటి మరమ్మతు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- పారిశుధ్యం విషయంలో పంచాయతీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా హోటళ్లలో శుభ్రమైన ఆహారం విక్రయించేలా తనిఖీలు చేపట్టని పక్షంలో భక్తుల ఆరోగ్యం ప్రశ్నార్థంగా మారనుంది.
- భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఉచిత బస్సుల సంఖ్యను పెంచుతున్నా, అవి ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రతి ట్రిప్పులోనూ కిక్కిరిసిపోతోంది. రెండు రోజులు మరింత రద్దీ పెరగనుండటంతో ఆ మేరకు బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాత్రి వేళల్లో వచ్చీవెళ్లే రైళ్ల సమయానికి తగ్గట్టుగా ట్రిప్పులను పెంచాలని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
- ఒక్కసారిగా భక్తులు తరలివస్తే తోపులాట జరగకుండా చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. అలాగే ఆలయంలో కూడా క్యూలైన్ల క్రమబద్ధీకరణ విషయంలో అప్రమత్తంగా లేనిపక్షంలో ఇబ్బందులు ఎదురుకానున్నాయి.
- మంచిర్యాల సమీపంలోని ముల్కల్ల ఘాట్‌కు కేవలం వందల్లోనే భక్తులు వచ్చే అవకాశాలున్నాయని ముందు గా అంచనా వేశారు. ఈ అంచనాలు తారుమారయ్యాయి. నిత్యం వేలల్లో భక్తులు వస్తుండడంతో ఈ ఘాట్‌ను ఉన్నఫలంగా విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. అవి తొందరగా పూర్తయ్యేలా చూడాలి.
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :
పుష్కరాలు చివరి అంకానికి చేరకున్నాయి. శనివారం సూర్యాస్తమయంతో పుష్కరాలు ముగియనున్నాయని వేదపండితులు పేర్కొంటున్నారు. పుష్కర స్నానాలు చేసేందుకు కేవలం రెండు రోజులే మిగిలి ఉండటంతో శుక్ర, శనివారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ముఖ్యంగా బాసర, సోన్, మంచిర్యాల వంటి ప్రధాన ఘాట్లకు తాకిడి పెరగనుంది. భక్తుల ర ద్దీని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టడం తప్పనిసరి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బాసర, సోన్, మంచిర్యాల, చెన్నూరు వంటి చోట్ల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు తప్పనిసరి.
సౌకర్యాలపై కలెక్టర్ జగన్మోహన్ స్పందిస్తూ.. శుక్ర, శనివారాల్లో పెరగనున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు చేపట్టాం. పుష్కర విధులు నిర్వర్తిస్తున్న అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాం. బాసరలో ఉచిత బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా, రాత్రివేళల్లో వచ్చే రైళ్ల సమయానికి ఈ బస్సులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశాం.
సీఎం కేసీఆర్ పర్యటన డౌటే..?
పుష్కరాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లాలో పర్యటిస్తారని అం దరూ భావించారు. పుష్కరాలు ముగిసేలోపు బాసరకు వచ్చే అవకాశాలున్నాయని అనుకున్నారు. మంత్రులూ ప్రకటించినా.. సీఎం పర్యటనపై సందిగ్ధం నెలకొంది.
శోభాయమానంగా ముగింపు..
పుష్కరాల ముగింపు కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించాలని బాసర దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా గోదావరి హారతి నిర్వహించాలని భావిస్తున్నారు. ఆలయం నుంచి గోదావరి వరకు శోభాయాత్ర నిర్వహించాలని భావిస్తున్నారు. అనంతరం గోదావరి తల్లికి, సరస్వతీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయాలనే యోచనలో ఉన్నారు.