మన్యంలో ఆగని చావుకేక
-
మరో గిరిజనుడు మృతి
-
ఆరుకు చేరిన మరణాల సంఖ్య
-
కాళ్లవాపు వ్యాధికి బలవుతున్న గిరిజనులు
రంపచోడవరం/ వీఆర్‌పురం :
కాళ్లవాపు వ్యాధితో మరో గిరిజనుడు మృతి చెందాడు. ఈయన మరణంతో మన్యంలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. వరుసగా ప్రాణాలుపోతున్నా అధికార యంత్రాంగంలో కదలిక అంతంతమాత్రంగానే ఉండడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గురువారం అర్ధరాత్రి కాకినాడ జీజీహెచ్‌లో ముసురు వెంకటస్వామి(30) ప్రాణాలు కోల్పోయాడు. మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రమైన కాకినాడలోని జిల్లా పెద్దాసుపత్రికి తరలించినా మరణాలు ఆగని పరిస్థితి నెలకుంది. వీఆర్ పురం మండలం అన్నవరం, లక్ష్మీనగరం గ్రామాల్లో కాళ్లవాపు మరణాలు సంభవించడంతో ప్రత్యేక వైద్య బృందం రక్త నమూనాలు సేకరించింది. ఇది జరిగి పది రోజులు దాటుతున్నా వ్యాధి ఎందుకు వస్తుందో నిర్థారించలేకపోయారు. ఇప్పటి వరకూ 56 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. వీ ఆర్ పురం మండలం లక్ష్మీనగరం, అన్నవరం, పెదమట్టపల్లి, చినమట్టపల్లితోపాటు చింతూరు మండలంలో ఒకటి రెండు గ్రామాల్లో కేసులు నమోదయ్యాయి. వ్యాధికి గల కారణాలు తెలియడం లేదని, జాతీయ స్థాయి వైద్య బృందం వస్తుందని అధికార యంత్రాంగం, మంత్రులు చెబుతున్నారే తప్ప అత్యవసరంగా తీసుకోవల్సిన చర్యలు మాత్రం ముందుకు సాగడం లేదు.
సర్వే జరుగుతుండగానే మరణాలు...
ఓ పక్క అధికారులు ఇంటింటి సర్వే చేసి ఈ వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించి మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి ఓ వైపు తరలిస్తుండగానే మరోవైపు చికిత్స పొందుతూనే మరణించడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 20న చినమట్టపల్లి గ్రామానికి చెందిన కారం రామారావు అనే గిరిజనుడు కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే మృతి చెందాడు. తాజాగా పెదమట్టపల్లి పంచాయతీ పరిధి తమ్మయ్య పేటకు చెందిన ముసురు వెంకటస్వామి (30) కూడా అదే తరహాలో మృత్యువాత పడ్డాడు. తమ్మయ్యపేటలో సర్వే నిర్వహించిన బృందం సభ్యులు వెంకటస్వామికి కాళ్లవాపు లక్షణాలున్నాయని గుర్తించి రేఖపల్లి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వెంకటస్వామిని అంబులెన్స్‌లో కాకినాడ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆస్పత్రిలో ప్రాణం విడిచాడు. వెంటస్వామికి భార్య రాజమ్మ , రెండేళ్ల కుమారుడు అఖిల్ ఉన్నారు.
నాలుగు గ్రామాలకు వ్యాపించిన వ్యాధి...
ఈ వ్యాధి అన్నవరం గ్రామంలో ప్రారంభమై అనంతరం లక్ష్మీనగరం, చినమట్టపల్లి, తమ్మయ్యపేట గ్రామాలకు వ్యాపించింది. గత నెల 13న రేఖపల్లి పంచాయతీ అన్నవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి పూసం మంగవేణి (18)తో ప్రారంభమైన కాళ్లవాపు మరణాలు వెంకటస్వామి మృతితో ఆరుకు చేరాయి. మంగవేణి మృతిచెందిన అనంతరం ఈ నెల 1వ తేదీన అదే అన్నవరం గ్రామానికి చెందిన గొడ్ల కన్నయ్య(21) అనే ఇంటర్ విద్యార్థి కూడా మృతి చెందాడు. 6న రామవరం పంచాయతీ లక్ష్మీనగరం గ్రామానికి చెందిన సరియం బాబురావు(22), 7న మళ్లీ అన్నవరం గ్రామానికి చెందిన బురకా ఎర్రయ్య(45), 20న చినమట్టపల్లి పంచాయతీ చినమట్టపల్లి గ్రామానికి చెందిన కారం రామారావు (45) కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. తాజాగా గురువారం అదే రీతిలో వెంకటస్వామి కూడా మృతిచెందాడు.
జ్వరం లేకుండానే కాళ్లవాపు...
వీఆర్ పురం మండలంలో కాళ్లవాపునకు గురై మృతి చెందిన పూసం మంగవేణి, గొడ్ల కన్నయ్య, బురకా ఎర్రయ్యలు తొలుత జ్వరం బారినపడి అనంతరం కాళ్లవాపునకు గురై మృత్యువాత పడగా తమ్మయ్యపేటకు చెందిన ముసురు వెంకటస్వామి మరణం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. స్వరే సిబ్బంది వెంకటస్వామికి కాళ్లవాపులు ఉన్నట్లు గుర్తించారు. నాకు జ్వరం లాంటిది ఏమీ లేదని ఆస్పత్రికి రానని తొలిత నిరాకరించిన అతడిని పంచాయతీ సిబ్బంది నచ్చచెప్పి రేఖపల్లి ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ అతడికి పరీక్షలు జరిపితే కాళ్లవాపు లక్షణాలు అధికంగా ఉన్నాయని తేలింది. దీంతో అతడిని బుధవారం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించిన రెండో రోజే మృతిచెందాడు.
నేడు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి పర్యటన...
గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా శనివారం విలీన మండలాల్లో పర్యటించనున్నారు. ఇప్పటికే అంతుచిక్కని వ్యాధితో గిరిజనులు మరణించడంతో క్షేత్రస్థాయిలో పరిస్ధితులు తెలుసుకునేందుకు పర్యటిస్తున్నారు.