మన్యంలో ఆగని మరణ మృదంగం | traible peoples dead | Sakshi
Sakshi News home page

మన్యంలో ఆగని మరణ మృదంగం

Published Fri, Oct 21 2016 10:14 PM | Last Updated on Tue, Mar 19 2019 9:23 PM

మన్యంలో ఆగని మరణ మృదంగం - Sakshi

మన్యంలో ఆగని మరణ మృదంగం

  • కాళ్లవాపు వ్యాధితో ఇద్దరి గిరిజనులు మృతి l
  • మన్యాన్ని కుదిపేస్తున్న మలేరియా, కాళ్లవాపు, చిన్నారుల మరణాలు
  • మన్యానికి ఏమైంది.. ఓ వంక కాళ్లవాపు, మరోవంక మలేరియా, ఇంకో వంక శిశుమరణాలు. ప్రాణాలను బలితీసుకుంటున్న ఈ వ్యాధులకు అంతేలేదా? ఈ మరణమృదంగం ఆగేదెన్నడు?

    రంపచోడవరం/కూనవరం/చింతూరు :
    మన్యాన్ని వ్యాధులు వణికిస్తున్నాయి. వివిధ రకాల రోగాలు సోకి నెల్లాళ్లలో అనేకమంది గిరిజనులు మృత్యువాత పడినప్పటికీ వారికి సరైన వైద్యసేవలందించడంలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు కాళ్లవాపు వ్యాధితో తొమ్మిది మంది మృతి చెందారు. తాజాగా కాళ్లవాపు వ్యాధితో కూనవరం మండలం దూగుట్ట గ్రామానికి చెందిన కణితి వెంకట్రావు (45), చింతూరు మండలం తుమ్మల గ్రామానికి చెందిన వుయికా రామయ్య (20) మరణించారు. గతనెలలో వెంకట్రావు జ్వరంతో బాధపడుతూ, స్వల్పంగా కాళ్లు వాపు ఉండటంతో కూనవరం ప్రభుత్వాస్పత్రిని ఆశ్రయించాడు. నాలుగైదు రోజులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి మెరుగు కాకపోవడంతో అదే నెల 19న భద్రాచలం ఏరియా అస్పత్రికి వైద్యులు రిఫర్‌ చేశారు. వారం రోజులపాటు ఏరియా ఆస్పత్రిలో వెంకట్రావుకు వైద్యం అందించారు. అయినప్పటికీ పరిస్థితి మరింత క్షీణించింది. కిడ్నీలు దెబ్బతిన్నాయని, తక్షణం కిడ్నీ సంబంధిత వైద్యులకు చూపించాలని  ఖమ్మం గాని, లేదా కాకినాడగాని తీసుకువెళ్లండని అక్కడి వైద్యులు సెప్టెంబర్‌ 26న రిఫర్‌ చేశారు. అంత దూరం తీసుకువెళ్లేందుకు డబ్బులు లేక ఏరియా ఆస్పత్రిలో ఇచ్చిన మందులు తీసుకొని వెంకట్రావును ఇంటికి తీసుకువచ్చారు. గురువారం రాత్రి పరిస్థితి మరింత విషమించడంతో చింతూరు ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా  లింగాపురం సమీపంలో వెంకట్రావు మరణించినట్టు అతని భార్య చంద్రమ్మ తెలిపింది. వుయికా రామయ్యకు కాళ్లవాపు వ్యాధి సోకడంతో నెలక్రితం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వ్యాధి నయమైందని వైద్యులు చెప్పడంతో ఈనెల 17వ తేదీన రామయ్య స్వగ్రామం వచ్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రెండ్రోజులుగా వ్యాధి మళ్లీ తిరగబెట్టడంతో శుక్రవారం అతను మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా అతని తండ్రి బుచ్చయ్య కూడా ఇదే వ్యాధితో మరణించాడు. 
     
     గాలిలో కలుస్తున్న పసివారి
    ఏజెన్సీలో పసిపిల్లల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయి. ఐదు నెలల లోపు పిల్లలు అనారోగ్యంతో మరణిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క రాజవొమ్మంగి మండలంలోనే ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. 
     
    నేనున్నానంటున్న మలేరియా
    ఏజెన్సీలోని అనేక చోట్ల మలేరియా మరణాలు సంభవించాయి. అయితే అధికారుల లెక్కల్లో మాత్రం మలేరియా మరణాలు నమోదు కావడం లేదు. ఏజెన్సీలోని 26 పీహెచ్‌సీల పరిధిలో 2015 ఆగస్టు వరకు 3,74,614 మంది నుంచి రక్తపూతలు సేకరించగా 3,616 మందికి మలేరియా ఉన్నట్టు నిర్ధారణ జరిగింది. ఈ ఏడాది 20,6392 మంది నుంచి రక్తపూతలు సేకరిస్తే 4,496 మందికి మలేరియా నిర్ధారణ అయింది. నమోదు కాని మలేరియా కేసుల సంఖ్య దీనికి మూడింతలు  ఉండవచ్చు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement