గిరిజనుల ఆర్థిక ప్రగతికి చర్యలు
-
పోషకాహారం లోపంతోనే వ్యాధులు l
-
సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్
రంపచోడవరం :
ఏజెన్సీలో ప్రతీ గిరిజన కుటుంబానికి నెలకు రూ. 3 వేల ఆదాయం వచ్చేట్లు, ప్రతీ గ్రామంలో జాబ్‌కార్డు ద్వారా నెలకు 15 రోజుల పనిదినాలు కల్పిస్తూ వారి ఆర్థికాభివృద్ధిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్ అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వీఆర్ పురం మండలంలో ప్రబలిన వ్యాధులపై నిపుణులైన రెండు వైద్య బృందాలు గిరిజనుల ఆరోగ్య స్థితిగతులపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారని తెలిపారు. పోషకారలోపాలతోనే వ్యాధుల బారిన పడుతున్నట్లు వారు నిర్ధారించారనానరు.
గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా వారిలో కొనుగోలు శక్తిని పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రంలో జిల్లా రెండవ స్ధానంలో ఉందని మొదటి స్థానానికి తీసుకురావడానికి మెరుగైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఉద్యానవనసాగులో జిల్లా మొదటి స్ధానంలో ఉందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల ఆవశ్యకతను తెలుపుతూ 2018 నాటికి జిల్లాను బహిరంగ మలవిసర్జణ రహిత జిల్లాగా ప్రకటించేందుకు అందరూ సమన్వయంతో పాటుపడాలని సూచించారు. యుకలిప్టస్ సాగును పూర్తిగా అధికారులు సమన్వయంతో అరికట్టి భూసారాన్ని, భూగర్భజాలాలను సంరక్షించాలని సూచించారు. అటవీహక్కుల ద్వారా పట్టాలు పొందిన గిరిజన రైతులను ఆ భూములును అభివృద్ధి చేసుకునేందుకు అటవీ అధికారులు అభ్యంతరాలు తెలుపుతున్నారని క్షేత్రస్థాయి సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. నవంబరులో మరో దఫా సమీక్ష నిర్వహిస్తామని అప్పటికీ పనితీరుమెరుగుపడకపోతే సంబంధిత సిబ్బందిని విధులు నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఐటీడీఏ పీవో కేవీఎన్ చక్రధరబాబు మాట్లాడుతూ పలు అంశాల్లో ఆశించిన స్థాయిలో సిబ్బంది పనితీరు లేకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి, డ్వామా పీడీ ఎ. నాగేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ ప్రవీణ్, పీఆర్ ఎస్‌ఈ వెంకటేశ్వరరావు, ఈఈ పీకే నాగేశ్వరరావు డీఈ శ్రీనువాసరావు తదితరులు పాల్గొన్నారు.