రైళ్లు, బస్సులు ఎక్కడికక్కడే..
సాక్షి, నెట్‌వర్క్: కాపు ఐక్యగర్జన సందర్భంగా తునిలో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో విశాఖ మార్గంలో వెళ్లే రైళ్లు, బస్సులకు ఎక్కడికక్కడ బ్రేక్‌లు పడ్డాయి. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఘటనతో అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే విభాగం.. ఆదివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి విశాఖ మార్గంలో వెళ్లే పలు రైళ్లను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి విశాఖ, కాకినాడ వైపునకు వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని మార్గమధ్యంలోనే నిలిపేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
నిలిచిన రైళ్ల వివరాలు..: విశాఖ నుంచి బయల్దేరే విశాఖ-కాకినాడ, విశాఖ-రాజమండ్రి, విశాఖ-విజయవాడ ప్యాసింజర్ రైళ్లు, విశాఖ-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖ-సికింద్రాబాద్ ఏసీ వీక్లీ ఎక్స్‌ప్రెస్, విశాఖ-సికింద్రాబాద్ దురంతో, విశాఖ సికింద్రాబాద్ గరీబ్థ్,్ర విశాఖ-విజయవాడ ప్రత్యేక రైళ్లను రద్దు చేశారు. విశాఖ మీదుగా వెళ్లే విశాఖ-తిరుపతి తిరుమలను తునిలో నిలిపేశారు. భువనేశ్వర్-బెంగళూరు(ప్రశాంతి) ఎక్స్‌ప్రెస్‌ను విశాఖ జిల్లా గుల్లిపాడులోను, హౌరా-చెన్నై మెయిల్‌ను నర్సీపట్నం రోడ్డులోనూ, గుంటూరు-విశాఖ(సింహాద్రి) ఎక్స్‌ప్రెస్‌ను హంసవరంలో నిలిపేశారు.
సికింద్రాబాద్ నుంచి బయల్దేరే గౌహతి ఎక్స్‌ప్రెస్‌ను పిఠాపురం వద్ద నిలిపేశారు. సికింద్రాబాద్ నుంచి విశాఖ బయల్దేరిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్ సామర్లకోట స్టేషన్ వరకే పరిమితమైంది. హైదరాబాద్-హౌరా ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ పెద్ద అవుతపల్లి స్టేషన్‌లో నిలిచిపోయింది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను కొవ్వూరులో, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ఏలూరులో, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ను తాడేపల్లిగూడెంలో నిలిపేశారు. అలాగే భువనేశ్వర్-బెంగళూరు సిటీ రైలు ఆలస్యంగా నడుస్తోంది. విజయవాడ-విశాఖ మార్గంలో వెళ్లే 15 రైళ్లను విజయవాడ, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట తదితర ప్రాంతాల్లో నిలిపేసినట్లు రైల్వే డీఆర్‌ఎం అశోక్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు.
కాగా, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఘటన ఉదంతం దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి విశాఖ,కాకినాడ వైపునకు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను దక్షిణమధ్య రైల్వే అధికారులు ఆదివారం అప్పటికప్పుడు రద్దు చేశారు. రైళ్ల రద్దు సంగతి తెలియకుండా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లకు చేరుకొన్న ప్రయాణికులు చివరి క్షణంలో రైళ్లు రద్దయినట్లు తెలిసి ఆందోళన వ్యక్తం చేశారు.
హెల్ప్‌లైన్ నంబర్లు: రైళ్ల రాకపోకలపై ప్రయాణికులకు సమాచారమిచ్చేందుకు హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. విశాఖ: 8500358230, 8106053051, 0891-2575083, విజయవాడ: 0866-2575038, రాజమండ్రి: 0883-2420451, 0883-2420543, తుని: 08854-252172
కదలని బస్సులు..: మరోవైపు విశాఖ నుంచి తుని మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను కూడా నిలిపివేశారు. విశాఖ ఆర్టీసీ రీజియన్‌లో హైదరాబాద్, తిరుపతి, చెన్నై, బెంగళూరు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి, నర్సాపూర్ వంటి దూరప్రాంతాలకు వెళ్లాల్సిన 175 బస్సులను రద్దు చేశారు. విజయవాడ నుంచి విశాఖ వెళ్లే 10 బస్సులను విజయవాడలోనే నిలిపివేశారు.