నాటక పోటీలకు ‘త్రికూటేశ్వర మహత్యం’
నాటక పోటీలకు ‘త్రికూటేశ్వర మహత్యం’
Published Sat, Oct 15 2016 8:57 PM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM
* కోటప్పకొండలో స్క్రీనింగ్ టెస్ట్
* డిసెంబర్ 12 నుంచి 21 వరకు తిరుపతిలో పోటీలు
నరసరావుపేట రూరల్: టీటీడీ ఆధ్వర్యంలో డిసెంబర్‌లో నిర్వహించే నాటక పోటీల కోసం శనివారం కోటప్పకొండలో స్కీనింగ్ టెస్ట్ నిర్వహించారు. పోటీలకు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కళాకారులు త్రికూటేశ్వర మహత్యం అనే పద్య నాటికను ఎంట్రీగా పంపారు. టీటీడీ సాంస్కృతిక విభాగానికి చెందిన కోనెటి సుబ్బరాజు, యానాపురం సత్యనారాయణతో కూడిన నలుగురు సభ్యులు ఈ నాటికను తిలకించారు. కోటప్పకొండలోని కమ్మసత్రంలో నాటకాన్ని ప్రదర్శించారు. డిసెంబర్ 12 నుంచి 21వ తేదీ వరకు తిరుపతి శ్రీవెంకటేశ్వర కళాపరిషత్ ఆధ్వర్యంలో మహతి ఆడిటోరియంలో గరుడ పోటీలు జరుగనున్నాయి. వచ్చిన ఎంట్రీలలో ఉత్తమ నాటకాలు, నాటికలను ఇక్కడ ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తారు. ఇందులో భాగంగా శనివారం ఈ నాటికను బృందం తిలకించింది.
మొత్తం 254 ఎంట్రీలు..
కళాపరిషత్ పోటీలలో పౌరాణిక నాటికలు, నాటకాలు, సాంఘిక నాటకాలు, బాలుర పౌరాణిక నాటికలు, లలిత సంగీతం తదితర విభాగాలలో పోటీలు నిర్వహించనున్నారు. వీటిలో పాల్గొనేందుకు దాదాపు 254 ఎంట్రీలు వచ్చినట్టు నాటకాన్ని పరిశీలించేందుకు వచ్చిన బృందం సభ్యులు తెలిపారు. వీటిలో ఉత్తమమైనవి గుర్తించి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఢిల్లీ తెలుగు సంఘాల నుంచి కూడా ఎంట్రీలు వచ్చినట్టు వివరించారు.
ఆకట్టుకున్న నాటక ప్రదర్శన...
కోటప్పకొండ త్రికూటేశ్వరస్వామి మహిత్యంపై కళాకారులు ప్రదర్శించిన పద్య నాటకం ఆకట్టుకుంది. త్రికూట పర్వతాలకు ఆ పేరు ఎలా వచ్చింది, దక్షయజ్ణం, గోల్లభామ తదితర ఘట్టాలను కళాకారులు ప్రదర్శించారు. రెండున్నర గంటల నిడివిగల నాటకంలో గుంటూరు, ప్రకాశం జిల్లాకు చెందిన 15 మంది కళాకారులు పాల్గొన్నారు. ఇద్దరు సురభి కళాకారిణులు ఇందులో ముఖ్యపాత్రలను పోషించారు. రాష్ట్రంలో ఎంతో గుర్తింపు ఉన్న తిరుపతి శ్రీవెంకటేశ్వర కళాపరిషత్ నాటిక పోటీలలో ప్రదర్శన ఇచ్చి త్రికోటేశ్వరుని మహాత్యాన్ని అందరికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో నాటకాన్ని ప్రదర్శిస్తున్నట్టు నిర్వాహకులు సింగర కొండయ్య చౌదరి తెలిపారు. రెండు నెలల పాటు కళాకారులకు శిక్షణ ఇచ్చామన్నారు.
Advertisement