బొడ్రాయి తెచ్చిన తంటా
♦ వడదెబ్బతో యువకుడి మృతి
♦ బోనాలయ్యే వరకు మృతదేహాన్ని తేవొద్దన్న గ్రామస్తులు
♦ ఆస్పత్రిలో మృతదేహంతో 14 గంటలు బంధువుల నిరీక్షణ
నల్లగొండ టౌన్: బొడ్రాయి పండుగ తెచ్చిన తంటా ఇంతా అంతా కాదు.. అనారోగ్యంతో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని బోనాలు పూర్తయ్యే వరకు గ్రామానికి తీసుకురావద్దని స్థానికులు చెప్పడంతో ఓ కుటుంబం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద సుమారు 14 గంటలు నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లికి చెందిన ఉప్పర శంకరయ్య గురువారం బొడ్రాయి పండుగ పనుల కోసం ఎండలో తిరి గాడు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చనిపోయాడు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకురావొద్దని గ్రామస్తులు హుకుం జారీ చేశారు.
బొడ్రాయి పండుగను నిర్వహిస్తున్నందున ఇతర గ్రామస్తులు గ్రామానికి రారని, తమ గ్రామస్తులు కూడా గ్రామం విడిచి వెళ్లవద్దని సూచించారు. దీంతో మృతుడిని కడసారి చూసేందుకు అతడి తల్లి కూడా బయటకు రాలేని స్థితి ఏర్పడింది. మరోవైపు మృతదేహాన్ని వార్డులో ఉంచే అవకాశం లేకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది మార్చురీ ఆవరణలో ఉంచారు. మృతుడి కుటుంబ సభ్యులు గురు వారం అర్ధరాత్రి నుంచి మార్చురీ వద్ద రోదిస్తూ గ్రామస్తుల అనుమతి కోసం వేచి చూశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పండుగ పూర్తయిందని గ్రామస్తులు చెప్పడంతో మృతదేహాన్ని అంబులెన్స్‌లో గ్రామానికి తీసుకెళ్లారు. కాగా మృతుడి సోదరి సునీత మాట్లాడుతూ ‘అన్న శంకరయ్య అర్ధరాత్రి చనిపోతే పండుగ ఉందని గ్రామానికి తీసుకురావద్దని చెప్పారు. అనారోగ్యంగా ఉన్న అమ్మ ముత్తమ్మను ఆస్పత్రికి వెళ్లొద్దన్నారు. మానసికంగా నలిగిపోయిన ఆమెకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత ’ అని ప్రశ్నించారు.