విస్తరణ లక్ష్యంతోనే ఖమ్మం బాట
♦ టీఆర్‌ఎస్ 15వ ఆవిర్భావ సభా వేదిక ఎంపిక వెనుక బలమైన వ్యూహం
♦ 2019 సాధారణ ఎన్నికలే టార్గెట్... ముందుచూపుతోనే నిర్ణయించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ విస్తరణపై దృష్టి పెట్టారా.. 2019 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ పునాదులను మరింత బలోపేతం చేసే పనిలో పడ్డారా? ఈ ప్రశ్నలకు పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఎంతో ముందు చూపుతోనే టీఆర్‌ఎస్ 15వ వార్షికోత్సవ సభ, ప్లీనరీలను ఖమ్మంలో ఏర్పాటు చేశార న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఏటా ఒక జిల్లా చొప్పున ఎంపిక చేసుకుని ప్లీనరీ, బహిరంగ సభలను నిర్వహించిన టీఆర్‌ఎస్... 14వ ఆవిర్భావ సభను హైదరాబాద్‌లో జరిపింది. దానికి రెండు రోజుల ముందు ఎల్‌బీ స్టేడియంలో ప్రతినిధుల సభను భారీగా నిర్వహించారు. అయితే పార్టీ ఆవిర్భవించాక ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో మాత్రం వార్షికోత్సవ బహిరంగ సభలు జరగలేదు. ఈసారి 15వ ఆవిర్భావ సభకు ఖమ్మంను ఎంపిక చేసుకున్నారు. దీని వెనుక ప్రత్యేక వ్యూహం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఖమ్మంను విముక్తి చేద్దాం!
తెలంగాణ ఏర్పాటయ్యాక జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో (2014) టీఆర్‌ఎస్‌కు ఉత్తర తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌తో పాటు మెదక్ జిల్లాలో వచ్చినన్ని ఎమ్మెల్యే స్థానాలను దక్షిణ తెలంగాణ జిల్లాల్లో రాలేదు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో సగం సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. ప్రధానంగా ఖమ్మం విషయానికి వస్తే టీఆర్‌ఎస్ గెలుచుకున్నది ఒక్క కొత్తగూడెం స్థానం మాత్రమే. ఈ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలను గెలుచుకోగా... కాంగ్రెస్ నాలుగు, టీడీపీ, సీపీఎం చెరో స్థానంలో నెగ్గాయి. జిల్లాలో ఉన్న ఒక్క ఎంపీ స్థానం కూడా వైఎస్సార్‌సీపీ జాబితాలోనే చేరింది. ఖమ్మం జిల్లాలో పరోక్షంగానైనా పట్టు సాధించేందుకు ఇక్కడి నుంచి గెలిచిన ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. అయినా సొంతంగా బలాన్ని పుంజుకునేందుకు ఇటీవల ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై గులాబీ పార్టీ దృష్టి పెట్టి.. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే మొత్తంగా ఖమ్మం జిల్లాను ఇతర పార్టీల చేతుల నుంచి విముక్తి చేద్దామన్న చర్చ టీఆర్‌ఎస్‌లో జరిగినట్లు తెలుస్తోంది.
గాడిలో పడింది...
ఖమ్మంలో నాయకత్వం లేమితో కొట్టుమిట్టాడిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు గాడిలో పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్‌రావు టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లోకి రావడం కొంత కలిసొచ్చిందని అంటున్నారు. అయితే నియోజకవర్గాల వారీగా సంస్థాగతంగా బలపడకుంటే లాభం లేదన్న అంచనాతోనే 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ, బహిరంగ సభలకు ఖమ్మంను వేదికగా ఎంచుకున్నారని చెబుతున్నారు. 2019 సాధారణ ఎన్నికల నాటికి జిల్లావ్యాప్తంగా విస్తరించడం, బలపడడమే దీని వెనుక లక్ష్యమని అంటున్నారు. ప్లీనరీ, సభల సందర్భంగా జిల్లావ్యాప్తంగా గ్రామ గ్రామానికి పార్టీని తీసుకువెళతామని, జిల్లాను గులాబీ మయం చేస్తామని జిల్లా మంత్రి తుమ్మల ప్రకటించడం వెనుక అర్థం ఇదే అన్న అభిప్రాయం వస్తోంది.