‘చంద్రబాబు డైరెక్షన్...కాంగ్రెస్ యాక్షన్’
కరీంనగర్: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునే కుట్రలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్ మేరకే.. ఇక్కడి కాంగ్రెస్ నేతలు యాక్షన్ చేస్తున్నారని రాష్ట్ర భారీనీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులను ఆపాలని టీడీపీ ఫిర్యాదు చేస్తే వారితో చెట్టపట్టాలేసుకొని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి వంటి నేతలు ధర్నాలకు దిగడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అడ్డంకులు సష్టించినా ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసి రాష్ట్రంలోని కోటి ఎకరాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
సోమవారం కరీంనగర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో హరీశ్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు తెలంగాణను నిర్లక్ష్యం చేశాయని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం వల్లే రైతాంగానికి ఈ దుస్థితి దాపురించిందన్నారు. రూ. 25 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి గోదావరి జలాలను తెలంగాణలోని ప్రతి ఎకరాకు అందించి తీరుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల విషయంలో రాద్ధాంతం చేయడం మానుకోవాలని హితవు పలికారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ పూర్తయితే ఉనికి లేకుండా పోతామనే బెంగతోనే ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం వహించి తెలంగాణకు తీరని ద్రోహం చేసింది చాలక.. ఇప్పుడు అడుగడుగునా అడ్డుతగలడం మూర్ఖత్వమని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ హయాంలో తెలంగాణను విస్మరించి కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే 156 టీఎంసీల నీటి సామర్థ్యం గల రిజర్వాయర్లను నిర్మించారని, మూడో పంటకు సైతం పులిచింతల ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంటే.. మంత్రి పదవి కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి వద్ద మోకరిల్లిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ప్రాజెక్టుల విషయంలో మాట్లాడే నైతిక అర్హతే లేదని హరీశ్‌రావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో చేపట్టిన 20 టీఎంసీల నీటి సామర్థ్యం గల ఎల్లంపల్లి ప్రాజెక్టులో 21 గ్రామాలు మునిగాయని, 25 టీఎంసీల నీటి నిల్వ చేసి మిడ్‌మానేరులో 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయని గుర్తుచేశారు. 50 టీఎంసీల సామర్థ్యం గల మల్లన్న సాగర్ ప్రాజెక్టులో 8 గ్రామాలు ముంపునకు గురవుతుంటే కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టడం దేనికోసమో బోధపడడం లేదని ఎద్దేవా చేశారు. ఒక పంటకు కూడా నీళ్లు లేక ఆకలితో అలమటించే తెలంగాణ రైతుల కడగండ్లు తీర్చేందుకు ప్రాజెక్టులు కడుతుంటే జీర్ణించుకోలేకపోవడం కాంగ్రెస్, టీడీపీలకే చెల్లిందన్నారు.