ప్రతిపక్షాల వాకౌట్ సిగ్గుచేటు
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మండిపాటు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధగా అసెంబ్లీలో చర్చ జరుగుతోందని, సీఎం కేసీఆర్ అందరికీ సవివరంగా సమాధానం ఇస్తుంటే సభను ముగించిన తర్వాత పాత విషయంపైనే మళ్ళీ పట్టుపట్ట డం సరికాదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, గాదరి కిశోర్ విపక్షాలపై మండిపడ్డారు. అయినా, గురువారం మళ్ళీ సభలో చర్చ సందర్భంగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నా, ప్రతిపక్షాలు వాకౌట్ చేయడం సిగ్గుచేటన్నారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ, సభలో సింగరేణి గురించి చర్చ జరుగుతుంటే వాళ్ల దగ్గర సబ్జెక్టు లేక బయటకు రావడం ఎంత వరకు సబబని నిలదీశారు. ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర పర్యటనకు వచ్చినందునే కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారని విమర్శించారు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో సభా సమయాన్ని వృధా చేయద్దని హితవు పలికారు.