ప్రగతికి కృషి
ప్రగతికి కృషి
Published Wed, Aug 16 2017 12:42 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
ఏలూరు (మెట్రో) : జిల్లా కేంద్రం ఏలూరు పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో జిల్లా సగర్వమైన పాత్ర పోషించిందన్నారు. బ్రిటీష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజును దేశానికి అందించిన వీరభూమి పశ్చిమగోదావరి జిల్లా అని కొనియాడారు. ఎందరో త్యాగధనులు దేశంకోసం తమ జీవితాలను పణంగా పెట్టారని గుర్తుచేసుకున్నారు.
ప్రగతికి కృషి
జిల్లా ప్రజల ప్రగతికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ప్రత్తిపాటి వెల్లడించారు. సాగు జలాలను మరింత సమర్థంగా వినియోగించుకుని మూడో పంటకు రైతులను సన్నద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో రైతులకు రూ.250 కోట్ల విలువైన విత్తనాలను 75శాతం సబ్సిడీపై అందించామని వివరించారు. 17వేల 601 భూసార పరీక్షలు నిర్వహించి 66వేల ఫలితాలను 2లక్షల మంది రైతులకు అందించామని చెప్పుకొచ్చారు.
పోలవరంతో కరువు నివారణ
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ కరువు నివారణ సాధ్యమని మంత్రి ప్రత్తిపాటి చెప్పారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో జిల్లాకు 29 టీఎంసీలు అందిస్తున్నామని వెల్లడించారు. నీటి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, కురిసిన వానబొట్టునూ పరిరక్షించుకోవాలని హితవు పలికారు. జిల్లాలో 43వేల స్వయం సహాయక సంఘాలకు రూ.987 కోట్లు రుణాలు అందిస్తున్నామని చెప్పారు. విద్య, వైద్యం, పౌరసరఫరాలు, గృహనిర్మాణం, ఉపాధిహామీ, స్వచ్ఛభారత్ వంటి పథకాల ప్రగతిని వివరించారు. పాపికొండలు, కొల్లేరు, యలమంచిలిలంక, నరసాపురం, ఎర్రకాలువ జలాశయం వంటి ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికైన జిల్లా జట్టును అభినందించారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులు, అధికారులకు సేవా పురస్కారాలు అందించారు. వేడుకల్లో వివిధ పాఠశాలలు, విద్యాసంస్థల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ ఎం.రవిప్రకాశ్, జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, ఏజేసీ షరీఫ్, కుక్కునూరు సబ్‌కలెక్టర్ ఎస్.షాన్‌మోహన్, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు, జడ్పీ చైర్మన్ ఎం.బాపిరాజు, రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ శాసనమండలి సభ్యులు రామూ సూర్యారావు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు, మేయరు నూర్జాహాన్, అదనపు ఎస్పీ రత్న, డీఆర్వో కె.హైమావతి, ఆర్డీఓ జి.చక్రధరరావు పాల్గొన్నారు.
Advertisement