సాక్షి, తిరుమల: అక్షయపాత్రను శరణువేడితో ఆహార సంపదకు కొదవ ఉండదు. అదే సత్సంకల్పంతోనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అక్షయ పాత్ర పేరుతో కొత్త వంటశాల నిర్మిస్తోంది. రోజుకు లక్ష మందికి ఆహార పదార్థాలు తయారు చేసేలా ఈ వంటశాలను అందుబాటులోకి తీసుకువస్తోంది.
మహాయజ్ఞంలా టీటీడీ అన్నప్రసాదం వితరణ
గత 30 వసంతాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మహాయజ్ఞంలా నిర్వహిస్తోంది. 1985 ఏప్రిల్ 6న రెండువేల మందితో ప్రారంభించి ప్రస్తుతం 1.27 లక్షల మందికి అన్నప్రసాదాలు అందిస్తోంది. ప్రధానంగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద కేంద్రంతోపాటు రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని వంటశాలల ద్వారా రోజుకు రూ.1.06 లక్షల మందికి, తిరుపతిలోన తిరుచానూరులో మరో 26 వేల మందికి అన్నప్రసాదాలు తయారుచేసి వడ్డిస్తున్నారు.
‘అక్షయ’ వంటశాలతో మరో లక్ష మంది అన్నప్రసాదాలు
సాధారణ రోజుల్లో వచ్చే భక్తులకు ప్రస్తుతం ఉన్న రెండు వంటశాలలు సరిపోతున్నాయి. అయితే, రద్దీ రోజుల్లోనూ, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లోనూ వచ్చే భక్తుల రద్దీకి ఇవి సరిపోవటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మరో లక్ష మందికి అన్నప్రసాదాలు వడ్డించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. పైగా రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని వంటశాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఆ వంటశాలతో వైకుంఠం క్యూకాంప్లెక్స్ పటిష్టత దెబ్బతినే అవకాశం కూడా ఉందని గుర్తించారు. దీంతో వెలుపల ప్రాంతంలో రోజుకు లక్ష మంది భక్తులకు అన్నప్రసాదాలు వండేలా కొత్త వంటశాల రూపొందించారు. ఈ కొత్త వంటశాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మార్చి చివరినాటికి నిర్మాణం పనులు పూర్తవుతాయి.
అక్షయను వేసవికి అందుబాటులోకి తీసుకొస్తాం
'అక్షయ' కొత్త వంటశాలను వేసవినాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు గారు ఆదేశించారు. ఆమేరకు మార్చినాటికి నిర్మాణం పనులు పూర్తవుతాయి. ఆ వెనువెంటనే వంటశాలకు సామగ్రి ఏర్పాటు చేస్తాం. ఇక్కడ వండే అన్నప్రసాదాలు శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూలోని భక్తులకు, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండేవారికి, ఉత్సవాల సమయాల్లో ఆలయ వీధుల్లో వేచి ఉండే భక్తులకు వడ్డిస్తాం. ఎంత రద్దీ వచ్చినా అందరికీ సులభంగా అన్నప్రసాదాలు వితరణ చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం.
-సాగి వేణుగోపాల్, టీటీడీ డెప్యూటీ ఈవో