తిరుపతి అభ్యర్థి ఖరారైనట్లేనా ?
- నరసింహయాదవ్‌కు తుడా చైర్మన్
- వ్యూహాత్మకంగా సీఎం చంద్రబాబు ప్రకటన
- అసంతృప్తితో రగిలిపోతున్న ఆశావహులు
- ఎన్టీఆర్ రాజు కుటుంబానికి మొండిచేయేనా?
సాక్షి, తిరుపతి: తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(తుడా) చైర్మన్‌గా టీడీపీ సీనియర్ నాయకుడు నరసింహయాదవ్‌ని నియమించారు. దీంతో 2019 తిరుపతి అసెం బ్లీ అభ్యర్థిత్వం కూడా ఖరారైనట్లేనని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇన్ని రోజులు ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న మిగిలిన ఏడుగురు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నరసింహయాదవ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీ తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి నరసింహయాదవ్ అని పార్టీ శ్రేణులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. మాజీ ఎమ్మెల్యేలు ఏ మోహన్, కోలా రాము, కందాటి శంకర్‌రెడ్డి, వెంకటరమణ, భూమన కరుణాకరరెడ్డి, ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వీరంతా తుడా చైర్మన్లుగా పని చేసి తరువాత తిరుపతి అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేశారు. అందులో భాగంగానే నరసింహయాదవ్‌న్‌ను తుడా చైర్మన్‌ను చేశారనే ప్రచారం జరుగుతోంది.
అధిష్టానంపై ఎన్టీఆర్ రాజు ఆగ్రహం..
స్వర్గీయ ఎన్టీ రామారావుతో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో ఎన్టీఆర్ రాజు ఒకరు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ రాజుతో రామారావుకి మంచి సంబంధాలు ఉన్నాయి. పార్టీ జెండా రూపకల్పనలో ఎన్టీఆర్ రాజు సలహాలు తీసుకున్నట్లు సమాచారం. ఆ తరవాత ఎన్టీ రామారావు ఏ పథకం ప్రవేశపెట్టినా ఎన్టీఆర్ రాజును సంప్రదిం చిన తరువాతే ప్రకటించేవారని, అలాంటి కుటుంబానికి ఇప్పటి వరకు టీడీపీలో తగిన గుర్తింపు లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ రాజుని, అతని కుమారుడు శ్రీధర్‌వర్మని పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటున్నారే తప్ప నామినేటెడ్ పదవి ఇచ్చిన దాఖలాలు లేవని ఆ పార్టీ నేతలే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌తో సన్నిహితంగా ఉన్న వారిలో దొరబాబుకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి సంతృప్తి పరిచారు. అదేవిధంగా ప్రస్తుతం కదిరప్ప కుమారుడు నరసింహయాదవ్‌కు ప్రస్తుతం తుడా చైర్మన్ పదవిని ఇచ్చి గౌరవించారు. వీరికంటే ముందు నుంచి పార్టీ కోసం జెండా మోసిన ఎన్టీఆర్ రాజు కుటుంబాన్ని విస్మరించారని ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా ఎన్టీఆర్ రాజుకి పార్టీ సముచిత స్థానం కల్పిస్తారా? లేదా? జెండా మోయడానికే పరిమితం చేస్తారా? అనేది వేచి చూడాలి.
తీవ్ర అసంతృప్తిలో ఆ ఏడుగురు..
తుడా చైర్మన్ పదవి కోసం మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు, డాక్టర్ సుధారాణి, జనతాగిరి, కేశవులునాయుడు, డాక్టర్ ఆశాలత, కుమార్ రాజారెడ్డి గట్టి ప్రయత్నాలు చేశారు. మంత్రి గల్లా అరుణకుమారి ఏదో ఒక హోదా ఉండాలనే ఉద్దేశంతో తుడా చైర్మన్ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబును అడిగినట్లు తెలిసింది. అదేవిధంగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు కూడా ఈ పదవిని ఆశించారు. 2014 ఎన్నికల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కోసం పనిచేస్తే తుడా చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే డాక్టర్ సుధారాణికి కూడా తుడా చైర్మన్ పదవిపై ఆశలు కల్పించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఆ పదవి ఇస్తారనే ఆశతో ఆమె పార్టీ కార్యక్రమాల కోసం అప్పులు చేసి భారీ ఎత్తున ఖర్చు చేశారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా తన అల్లుడి సన్నిహితుడు జనతాగిరి కోసం ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా డాక్టర్ ఆశాలత కూడా ఈ పదవిని ఆశించారు. ఇకపోతే రామచంద్రాపురం మండలానికి చెందిన కేశవులునాయుడు కూడా సీఎం ద్వారా తుడా చైర్మన్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. చంద్రగిరికి చెందిన కుమార్‌రాజారెడ్డి కూడా తుడా చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే వీరందరినీ కాదని నరసింహయాదవ్‌ను పదవి వరించింది.