tuda chairman
-
తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
సాక్షి, తిరుపతి: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(తుడా) ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కొనసాగింపు
సాక్షి, విజయవాడ: తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మరో రెండేళ్లపాటు కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 11న మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో అంతకు ముందే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదవి కాలాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చదవండి: (కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు) -
మన సంప్రదాయాలకు వాల్మీకీ రామాయణం ఆదర్శం
సింగపూర్ : మన సంస్కృతీ, సాంప్రదాయాలకు వాల్మీకి రామాయణం ఆదర్శమని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. టీటీడీ పద్మావతి డిగ్రీ, పీజీ కళాశాల, సింగపూర్ తెలుగు సమాజం సంయుక్త ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి సందర్భంగా ‘వాల్మీకి రామాయణ సందేశం‘ అంతర్జాతీయ అంతర్జాల సదస్సు నిర్వహించారు. ఉపన్యాసకులుగా ఇండోనేషియా నుంచి రామాయణ హరినాథ్ రెడ్డి వ్యవహరించారు. ముఖ్య అతిథిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక శ్రీ పద్మావతి అతిథి గృహం వేదికగా అంతర్జాల సదస్సును అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. రామాయణ సందేశం నేటి సమాజానికి ఆవశ్యకమని స్పష్టం చేశారు. భగవంతుడు స్వయంగా మానవునిగా అవతరించారని, ఎలా జీవించాలనే చూపారని తెలిపారు. త్రేతాయుగం నాటి శ్రీ రామ చంద్రుడు కుటుంబ ధర్మం, పితృ వాక్ పరిపాలన, రాజ్య పాలన వంటివి గొప్పగా చేపట్టి చక్కటి సందేశాన్ని ఇచ్చారన్నారు. నేటి యువత తప్పక వాల్మీకి రామాయణం ద్వారా ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని ఆకాంక్షించారు. శ్రీరాముని గుణగణాలను విద్యార్థులు అలవర్చుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహదేవమ్మ అన్నారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి జయంతి నాడు ఆయన రాసిన రామాయణం వినడం పుణ్యఫలం అన్నారు. వాల్మీకి రామాయణ సందేశం ఉపన్యాసకులు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ధర్మప్రవర్తనా పరుడైన శ్రీ రాముని చరిత్ర వింటేనే జన్మ తరిస్తుందన్నారు. సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రామాయణ విశిష్టతను తెలియజేసేందుకు తాము చేపట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని అన్నారు. ఈ అంతర్జాతీయ అంతర్జాల సదస్సుకు దాదాపు 25 దేశాల నుంచి ప్రతినిధులు వెబినార్ కు హాజరయ్యారు. ఇందులో ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, పిలిప్పైన్, ఇండోనేషియా, యుఎస్ఎ తదితర దేశాలు ఉన్నాయి. వేల సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ఈ వెబినార్ లో పాల్గొన్న ప్రతినిధులకు టీటీడీ ఈ సర్టిఫికెట్ ను అందజేయనుంది. -
తుడాకు ప్రత్యేక లీగల్ సెల్: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో తహశీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషస్‌ల దగ్గర ప్రత్యేక రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తుడా ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి సమావేశంలో అయన పాల్గొని.. దీని పరిధిలో రెండు నర్సరీలు ఏర్పాటు చేస్తామన్నారు. దీంతోపాటు ప్రతి ఇంటికి నాలుగు మొక్కల చొప్పున.. కొబ్బరి, జామ, పూల చెట్లను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. శ్రీసిటీని తుడా పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వ ఆమోదానికి తీర్మానం చేశామని తెలిపారు. తుడాకు చెల్లించాల్సిన రూ.35 కోట్ల బకాయిలు టీటీడీ చెల్లించాలి ఆదేశించారు. కాగా తుడాకు ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేసి.. రిటైర్డ్ ఉద్యోగుల నియమాకం చేపడతామన్నారు. దీని పరిధిలో ఉన్న అక్రమ లేఅవుట్లపై విచారణకు ఆదేశాలు జారీ చేసి అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
తుడా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఉదయం తుడా కార్యాలయంలోని తన ఛాంబర్లో అడుగుపెట్టిన చెవిరెడ్డి... ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. మహానేత వైఎస్ఆర్ హయాంలోనూ చెవిరెడ్డి తుడా చైర్మర్‌గా పనిచేశారు. తుడా పరిధిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెవిరెడ్డి తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తిరుమల శ్రీవారిని పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్, కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విడివిడిగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో కుటుంబసమేతంగా... ఎమ్మెల్యేలు స్వామివారిని సేవించుకున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్న పథకాలను పూర్తిస్థాయిలో ప్రజలకు అందజేస్తామన్నారు. ఏపీకి వైఎస్ జగన్ దీర్ఘకాలం సీఎంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. -
తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
-
తుడా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి : తుడా చైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హాజరై అభినందనలు తెలిపారు. కాగా చెవిరెడ్డి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనూ ఆయన తుడా చైర్మన్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ...తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. -
తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి నియామకం
సాక్షి, తిరుపతి తుడా: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) చైర్మన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమిస్తూ ఈనెల 8న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శ్యామలారావు ఉత్తర్వులు జారీచేశారు. జీవో నంబర్ 198 ద్వారా ఈ ఉత్తర్వులు బుధవారం వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మంచిరోజు చూసుకుని తుడా చైర్మన్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. చెవిరెడ్డిని ఇప్పటికే ప్రభుత్వ విప్‌గా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో తొలి నామినేటెడ్ పదవిని ఆయనకే కట్టబెట్టారు. మూడేళ్ల కాల వ్యవధితో నియమితులైన ఆయన 2022 మే వరకు తుడా చైర్మన్‌గా కొనసాగనున్నారు. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో చెవిరెడ్డి మార్కు తుడా చైర్మన్‌గా అభివృద్ధిని ఇలా కూడా చేయించవచ్చని ఇద్దరంటే ఇద్దరే నిరూపించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రాజకీయ గురువైన భూమన కరుణాకర్‌రెడ్డి తుడాను అభివృద్ధి బాట పట్టిం చారు. అనంతరం ఆ పదవిని చేపట్టిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభివృద్ధిలో తన మార్కు పాలన చేశారు. పట్టణం నుంచి పల్లె వరకు సీసీ రోడ్లు వేయించిన ఘనత ఆయనకే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ముఖ్యంగా కనీస అవసరాలకు నోచుకోని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి రికార్డు సృష్టించారు. సీసీ రోడ్లు, కాలువలు, పచ్చదనంతో పల్లెల రూపు రేఖలు మార్చేశారు. 2007లోనే 2020 విజన్ పేరుతో అభివృద్ధికి ప్రణాళికలు రచించారు. ప్రతి మండలానికీ సుమారు 100 సీసీ రోడ్లు వేయించారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు జన్మనిచ్చిన నారావారిపల్లి సొంత గ్రామాన్ని పట్టించుకోకపోవడంతో స్థానికుల అభ్యర్థన మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ గ్రామానికి సీసీ రోడ్లు వేయిం చారు. ఇలా కుల, మత, ప్రాంత తారతమ్యాలు లేకుండా ఆయన తుడా పరిధిలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి చేపట్టారు. పలు చెరువుల అభివృద్ధి, పచ్చదనం పెంపునకు ప్రాధాన్యత ఇచ్చారు. ఐదు మండలాల్లోని ప్రతి గ్రామంలో మహిళా భవనాలను నిర్మించి మహిళా సాధికారితకు కృషి చేశారు. ఎమ్మార్‌పల్లి–మహిళా వర్సిటీ, ఉప్పరపల్లి, రేణిగుంట జంక్షన్, కరకంబాడి వంటి అనేక ప్రధాన రోడ్ల విస్తరణ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హయాంలో చేపట్టినవే. తుడా కార్యాలయాన్ని కార్పొరేట్ హంగులతో ఆధునికీకరించారు. తుడా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తుడా విస్తరణ తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట నాలుగు మండలాల పరిధికే పరిమితం అయిన తుడాను 9 మండలాలకు విస్తరించిన ఘనత చెవిరెడ్డికే దక్కుతుంది. ఆ నాలుగు మండలాలతో పాటు రామచంద్రాపురం, శ్రీకాళహస్తి, ఏర్పేడు, వడమాలపేట, పుత్తూ రు మండలాలను తుడాకు విలీనం చేసి విస్తరించారు. విస్తరించిన మండలాల్లోని గ్రామాలను సైతం అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు పనిచేసిన తుడా చైర్మన్లు వి.వెంకటమునిరెడ్డి 1982–83 ఎం.వెంకట్రామానాయుడు 1984–85 ఎం.మోహన్ 1986–87 ఎస్.మునిరామయ్య 1988–89 కోలా రాము 1989–90 డాక్టర్ ఆర్.రాజశేఖర్‌రెడ్డి 1992–94 ఎల్బీ ప్రభాకర్ 1995–95 కందాటి శంకర్‌రెడ్డి 1998–99 ఎన్వీ ప్రసాద్ 2003–04 భూమన కరుణాకరరెడ్డి 2004–06 డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 2007–10 ఎం.వెంకటరమణ 2013–15 ఎన్.నరసింహయాదవ్ 2017–19 -
తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియమించింది. కాగా ఇప్పటికే ఆయన ప్రభుత్వ విప్‌గా కూడా నియమితులయ్యారు. ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి పులివర్తి వెంకట మణిప్రసాద్‌పై గెలుపొందిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలు సాధించింది.13 అసెంబ్లీ సీట్లతోపాటు రెండు ఎంపీ సీట్లను పార్టీ కైవసం చేసుకుంది. కాగా ప్రాంతీయ సమతౌల్యం పాటిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గ కూర్పులో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. -
తిరుపతి అభ్యర్థి ఖరారైనట్లేనా ?
- నరసింహయాదవ్‌కు తుడా చైర్మన్ - వ్యూహాత్మకంగా సీఎం చంద్రబాబు ప్రకటన - అసంతృప్తితో రగిలిపోతున్న ఆశావహులు - ఎన్టీఆర్ రాజు కుటుంబానికి మొండిచేయేనా? సాక్షి, తిరుపతి: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(తుడా) చైర్మన్‌గా టీడీపీ సీనియర్ నాయకుడు నరసింహయాదవ్ని నియమించారు. దీంతో 2019 తిరుపతి అసెం బ్లీ అభ్యర్థిత్వం కూడా ఖరారైనట్లేనని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇన్ని రోజులు ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న మిగిలిన ఏడుగురు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నరసింహయాదవ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీ తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి నరసింహయాదవ్ అని పార్టీ శ్రేణులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. మాజీ ఎమ్మెల్యేలు ఏ మోహన్, కోలా రాము, కందాటి శంకర్‌రెడ్డి, వెంకటరమణ, భూమన కరుణాకరరెడ్డి, ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వీరంతా తుడా చైర్మన్లుగా పని చేసి తరువాత తిరుపతి అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేశారు. అందులో భాగంగానే నరసింహయాదవ్న్ను తుడా చైర్మన్‌ను చేశారనే ప్రచారం జరుగుతోంది. అధిష్టానంపై ఎన్టీఆర్ రాజు ఆగ్రహం.. స్వర్గీయ ఎన్టీ రామారావుతో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో ఎన్టీఆర్ రాజు ఒకరు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ రాజుతో రామారావుకి మంచి సంబంధాలు ఉన్నాయి. పార్టీ జెండా రూపకల్పనలో ఎన్టీఆర్ రాజు సలహాలు తీసుకున్నట్లు సమాచారం. ఆ తరవాత ఎన్టీ రామారావు ఏ పథకం ప్రవేశపెట్టినా ఎన్టీఆర్ రాజును సంప్రదిం చిన తరువాతే ప్రకటించేవారని, అలాంటి కుటుంబానికి ఇప్పటి వరకు టీడీపీలో తగిన గుర్తింపు లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ రాజుని, అతని కుమారుడు శ్రీధర్వర్మని పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటున్నారే తప్ప నామినేటెడ్ పదవి ఇచ్చిన దాఖలాలు లేవని ఆ పార్టీ నేతలే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌తో సన్నిహితంగా ఉన్న వారిలో దొరబాబుకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి సంతృప్తి పరిచారు. అదేవిధంగా ప్రస్తుతం కదిరప్ప కుమారుడు నరసింహయాదవ్‌కు ప్రస్తుతం తుడా చైర్మన్ పదవిని ఇచ్చి గౌరవించారు. వీరికంటే ముందు నుంచి పార్టీ కోసం జెండా మోసిన ఎన్టీఆర్ రాజు కుటుంబాన్ని విస్మరించారని ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా ఎన్టీఆర్ రాజుకి పార్టీ సముచిత స్థానం కల్పిస్తారా? లేదా? జెండా మోయడానికే పరిమితం చేస్తారా? అనేది వేచి చూడాలి. తీవ్ర అసంతృప్తిలో ఆ ఏడుగురు.. తుడా చైర్మన్ పదవి కోసం మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, డాక్టర్ సుధారాణి, జనతాగిరి, కేశవులునాయుడు, డాక్టర్ ఆశాలత, కుమార్ రాజారెడ్డి గట్టి ప్రయత్నాలు చేశారు. మంత్రి గల్లా అరుణకుమారి ఏదో ఒక హోదా ఉండాలనే ఉద్దేశంతో తుడా చైర్మన్ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబును అడిగినట్లు తెలిసింది. అదేవిధంగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు కూడా ఈ పదవిని ఆశించారు. 2014 ఎన్నికల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కోసం పనిచేస్తే తుడా చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే డాక్టర్ సుధారాణికి కూడా తుడా చైర్మన్ పదవిపై ఆశలు కల్పించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ పదవి ఇస్తారనే ఆశతో ఆమె పార్టీ కార్యక్రమాల కోసం అప్పులు చేసి భారీ ఎత్తున ఖర్చు చేశారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా తన అల్లుడి సన్నిహితుడు జనతాగిరి కోసం ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా డాక్టర్ ఆశాలత కూడా ఈ పదవిని ఆశించారు. ఇకపోతే రామచంద్రాపురం మండలానికి చెందిన కేశవులునాయుడు కూడా సీఎం ద్వారా తుడా చైర్మన్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. చంద్రగిరికి చెందిన కుమార్‌రాజారెడ్డి కూడా తుడా చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే వీరందరినీ కాదని నరసింహయాదవ్‌ను పదవి వరించింది. -
వెంకటరమణ ప్రతిపాదనకు..గ్రీన్ సిగ్నల్
* కొనసాగింపునకు సీఎం ఆమోదం * తుడా పాలకమండలినియామకానికి బ్రేక్ * అధికారులను సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎన్నికల్లో కుదిరిన ఒప్పందం మేరకు తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణను తుడా(తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ) చైర్మన్‌గా కొనసాగించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. కానీ.. తుడా పాలక మండలిని నియమించేందుకు నిరాకరించారు. తుడా పాలక మండలిలో అధికారులను సభ్యులుగా నియమిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు మంగళవారం ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం:190) జారీచేశారు. వివరాలిలా.. ఎం.వెంకటరమణను తుడా చైర్మన్‌గా నియమిస్తూ ఫిబ్రవరి 11, 2014న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. సీఎంగా కిరణ్ రాజీనామా చేయడానికి కొద్ది రోజుల ముందే ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన విషయం విదితమే. కాంగ్రెస్‌పార్టీలో ఉన్న తుడా చైర్మన్ ఎం.వెంకటరమణకు తిరుపతి శాసనసభ అభ్యర్థిత్వం ఇస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో ఎర వేశారు. టీడీపీలో చేరేందుకు అంగీకరించిన వెంకటరమణ.. తాను గెలిచినా ఓడినా తుడా చైర్మన్‌గా కొనసాగించాలనే షరతు పెట్టారు. ఆ షరతుకు అంగీకరించిన చంద్రబాబు..ఆయనకు టీడీపీ తీర్థం ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి శాసనసభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన వెంకటరమణ విజయం సాధించారు. కాంగ్రెస్ హయాంలో నియమించిన దేవాలయ, మార్కెట్‌యార్డు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పాలకమండళ్లను రద్దు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ మేరకు చర్యలు కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు తన పదవీ కాలం పూర్తయ్యే(ఫిబ్రవరి 10, 2016) వరకూ తనను తుడా చైర్మన్‌గా కొనసాగించాలని చంద్రబాబుపై వెంకటరమణ ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన సీఎం చంద్రబాబు.. అన్ని పాలక మండళ్లను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసినా తుడాను తప్పించారు. కానీ.. ఈ అంశంపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే తుడా పాలక మండలి నియామకంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేలా అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. తుడా అధికారులు పంపిన ప్రతిపాదనలపై మంగళవారం ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. పదవీకాలం పూర్తయ్యే వరకూ వెంకటరమణనే తుడా చైర్మన్‌గా కొనసాగిస్తున్నట్లు స్పష్టీకరించింది. కానీ.. పాలక మండలిలో అనధికారుల(టీడీపీ నేతల)ను నియమించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించలేదు. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు పూర్తయ్యే దాకా తుడా పాలక మండలిని నియమించకూడదని సీఎం నిర్ణయించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. పాలక మండలి నియామకం జరిగే వరకూ తుడాకు మెంబర్ కన్వీనర్‌గా తుడా వీసీ వెంకటేశ్వరరెడ్డి, సభ్యులుగా తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ సకలారెడ్డి, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కార్యదర్శి లేదా ఆయన ప్రతినిధి, ప్రభుత్వ ఆర్థిక, ప్రణాళికశాఖ కార్యదర్శి లేదా ఆయన ప్రతినిధులను సభ్యులుగా నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పాలక మండలి నియామకం చేసే వరకూ ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టీకరించడం గమనార్హం.