మలుపు తిరగనున్న సుశీల హత్య కేసు
♦ పథకం ప్రకారమే..?
♦ ఒక్కడే నిందితుడని చేతులు దులుపుకున్న పోలీసులు
♦ తాజాగా వెలుగులోకి సరికొత్త అంశం
పుల్‌కల్: గిరిజన మహిళ హత్య కేసు మరో మలుపు తిరగనుంది. ఇప్పటికే పోలీసులు గిరిజన మహిళను హత్య చేసింది ఒక్కరే అని నిర్ధారించి కోర్టుకు సైతం రిమాండ్ చేశారు. తీరా బుధవారం మృతురాలికి సంబంధించిన టిఫిన్ బాక్సుతోపాటు ఇతర సామగ్రి, అక్కడే హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న యాక్సర్ బ్లేడు లభించడంతో ఈ కేసు కొత్త మలుపు తిరగనుంది. ఇప్పటికే హత్యకు గురైన మహిళ వివాహేతర సంబంధం పెట్టుకున్న బస్వాపూర్‌కు చెందిన వెండికోల్ రాజు జూన్ 1న రాత్రి ఆమెతో గడపాలనుకున్నాడు. కానీ ఆమె నిరాకరించినందు వల్లే కరెంటు వైరుతో గొంతు నులిమి హత్య చేసినట్లుగా పోలీసులు ధృవీకరించారు.
కానీ గురువారం లభించిన యాక్సర్ బ్లేడును పరిశీలించినట్లయితే ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే ఆమెను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. హత్య జరిగిన స్థలానికి కొద్ది దూరంలోనే లభించిన బీరు బాటిళ్లను పరిశీలిస్తే రాజుతోపాటు మరో ఇద్దరు కలిసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి హత్యకు గురైన సుశీల టిఫిన్ బాక్సుతోపాటు బీరు బాటిళ్లు లభించడం ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. నిందితుడు రాజు వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే... తనకు సహకరించనందునే మహిళను హత మార్చినట్లుగా వెల్లడించడానికి, సంఘటన స్థలంలో లభించిన వాటిని పరిశీలిస్తే ఏమాత్రం పొంతన లేకుండా పోయింది.
దీంతో సుశీలను హత్య చేసింది రాజు ఒక్కడేనా? మరి ఇంకెవరితో అయినా కలిసి చేశాడా? అనే దానిపై విచారణ జరిపితే అసలు నిందితులు బయటపడే అవకాశముంది. ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్న యాక్సర్ బ్లేడు, సుశీలకు సంబంధించిన క్లిప్పులు, టిఫిన్ బాక్సు లభించడాన్ని చూస్తే ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే హత్య చేసినట్లుగా తెలుస్తోంది. హతురాలు సుశీల మెడ పైన స్వల్ప గాయమున్నా, గొంతు మాత్రం పూర్తిగా తెగిపోవడాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం లభించిన యాక్సర్ బ్లేడుతోనే కోసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఏమైనా సుశీల హత్యలో గోపాల్‌తోపాటు మరికొంత మంది హస్తం ఉందని తెలుస్తోంది.