దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 27 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. చాంద్రాయణగుట్ట తాళ్లకుంట ప్రాంతానికి చెందిన మహ్మద్ శంషూద్దీన్, మహ్మద్ నూరుద్దీన్(20) తండ్రి కొడుకులు.
కాగా నూరుద్దీన్ పుట్టినప్పుడే తల్లి చనిపోవడంతో శంషూద్దీన్ కుమారుడిని తన తమ్ముడు మహ్మద్ బషీరుద్దీన్‌కు ఇచ్చి వేరే వివాహం చేసుకున్నాడు. ఇలా చిన్న తనం నుంచి చిన్నాన్న బషీరుద్దీన్ వద్దే పెరిగిన నూరుద్దీన్ పూలు విక్రయించేవాడు. కాగా చెడు అలవాట్లకు బానిసైన నూరుద్దీన్ సులభంగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే 2015 మే మాసంలో తన పెరిగిన చిన్నాన్న ఇంట్లోనే ఎవరూ లేని సమయం చూసి 17 తులాల బంగారు ఆభరణాలు తస్కరించాడు. ఈ బంగారు ఆభరణాలను శాలిబండలోని ఎం.ఎం. జ్యూయలరీ దుకాణం ఉన్న తన స్నేహితుడు సయ్యద్ ముజఫర్(29)కు ’ 75 వేలకు విక్రయించాడు. ఎలాంటి బిల్లులు లేకుండా ఉన్న ఈ బంగారు ఆభరణాలను అదును చూసిన ముజఫర్ తక్కువ ధరకే కొనుగోలు చేశాడు. ఈ విషయమై అప్పట్లోనే నూరుద్దీన్ చిన్న తల్లి చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నూరుద్దీన్‌పై ఫిర్యాదు చేసింది.
కాగా అప్పుడు నిందితుడు నేరం ఒప్పుకోలేదు. తమ ఇంట్లో ఉండి దొంగతనం చేసినందుకు బషీరుద్దీన్ వెంటనే నూరుద్దీన్‌ను ఇంటి నుంచి గెంటి వేశాడు. మళ్లీ ఈ నెలలో బషీరుద్దీన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో నూరుద్దీన్ పది తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట డీఐ పి.శంకర్, ఎసై ్స రాజశేఖర్‌లు నూరుద్దీన్‌ను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం వెల్లడించాడు. నూరుద్దీన్‌తో పాటు అతని స్నేహితుడు ముజఫర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి ’ 9 లక్షల విలువ జేసే 27 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ విలేకర్ల సమావేశంలో ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ, చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ వై.ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.