శబరిమలకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం
ధర్మవరం మండలానికి చెందిన ఇద్దరు మృతి
మృతుల్లో వైఎస్సార్ ఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి
మరొకరు ఆయన స్నేహితుడు మోహన్‌రెడ్డి
రెండు కుటుంబాల్లో విషాదం
ధర్మవరం రూరల్ : అయ్యప్పమాల ధరించి శబరిమలకు వెళుతున్న ఇండికా కారు ముందు వెళుతున్న లారీని ఢీకొంది. తమిళనాడులో జరిగిన ఈ ప్రమాదంలో ధర్మవరం మండలానికి చెందిన ఇద్దరు దుర్మరణం చెందారు. మృతుల్లో వైఎస్సార్ విద్యార్థి విభాగం (వైఎస్సార్‌ఎస్‌యూ) రాష్ట కార్యదర్శి సి.నరసింహారెడ్డి (26), ఆయన స్నేహితుడు మోహన్‌రెడ్డి ఉన్నారు. మృతుల బంధువులు, సన్నిహితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రేగాటిపల్లికి చెందిన నరసింహారెడ్డి ఇటీవల అయ్యప్పమాల ధరించాడు. తనతోపాటు అయ్యప్ప మాల ధరించిన వినోద్ గౌడ్, నారాయణస్వామితో పాటు స్నేహితుడు మోహన్‌రెడ్డి (28), అమరనా«థ్‌రెడ్డి, శ్రీకాంత్‌తో కలిసి నరసింహారెడ్డి గురువారం సాయంత్రం శబరిమలకు ఇండికా కారులో బయల్దేరారు.
శుక్రవారం తెల్లవారుజామున తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ వద్ద ముందు వెళుతున్న లారీని వెనుక వైపు నుంచి ఇండికా కారీ ఢీకొంది. కారులో ముందు భాగంలో కూర్చున్న నరసింహారెడ్డి, డ్రైవింగ్ చేస్తున్న మోహన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీటులో కూర్చున్న రేగాటిపల్లికి చెందిన అమరనాథర్‌రెడ్డికి చేయి విరిగింది. అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్, నారాయణస్వామి, కుణుతూరుకు చెందిన వినోద్‌గౌడ్ స్పల్పంగా గాయపడ్డారు.
మృత్యువులోనూ వీడని స్నేహ బంధం :
మృతులు నరసింహారెడ్డి, మోహన్‌రెడ్డి కళాశాల స్థాయి నుంచే మిత్రులు. డిగ్రీ అనంతరం నరసింహారెడ్డి ఎస్‌కే యూనివర్సిటీలో పీజీలో చేరగా, ధర్మవరానికి చెందిన మోహన్‌రెడ్డి కారును కొనుగోలు చేసి, అద్దెకు తిప్పుతుండేవాడు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
విద్యార్థి దశ నుంచే ఉద్యమ బాట :
రేగాటిపల్లికి చెందిన భాస్కర్‌రెడ్డి, శివమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో చివరి వాడు నరసింహారెడ్డి. డిగ్రీ వరకు ధర్మవరంలోనే చదివారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. అనంతరం వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులై, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఎస్‌కేయూలో పీజీ చేరి అక్కడ కూడా విద్యార్థి సమస్యల కోసం ఉద్యమించారు.
నేడు అంత్యక్రియలు :
మృతదేహాలను శనివారం తెల్లవారుజామున స్వగ్రామాలకు తీసుకువచ్చే అవకాశం ఉందని బంధువులు తెలిపారు. శనివారం అంత్యక్రియలు ఉంటాయని వారు చెప్పారు.
ఘోరం..
Published Fri, Dec 9 2016 11:58 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement