వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
ప్యాపిలి: రాచర్ల–ప్యాపిలి రహదారిలో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. బోంచెర్వుపల్లి వద్ద ఉన్న ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ లోడుతో వస్తున్న లారీ మునిమడుగు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అనంతపురం జిల్లా అమడుగురుకు చెందిన లారీ డ్రైవర్ ప్రతాప్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలకు గురైన లారీ క్లీనర్ మునయ్యను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాచర్ల ఎస్‌ఐ నరేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ బోల్తా పడి ఒకరి మృతి..
జలదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోపాలనగరం మిట్ట వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అనంతపురం జిల్లా నుంచి ఇసుక లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ గోపాలనగరం మిట్ట వద్దకు రాగానే అదుపు తప్పింది. దీంతో ఇంజన్ నుంచి ట్రాలీ విడిపోయి బోల్తా పడింది. ప్రమాదంలో ట్రాలీలో ఉన్న అనంతపురం జిల్లా పెదపప్పూరు మండలం తురకపల్లికి చెందిన వెంకటరాముడు(35) మృతి చెందాడు. జలదుర్గం ఏఎస్‌ఐ గోపాల్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.