
పడవ బోల్తా.. ఇద్దరు గల్లంతు
ఐ.పోలవరం: తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం భైరవపాలెం సమీపాన సముద్రంలో పడవ బోల్తా పడింది. సముద్రపు ఆటుపోటులకు మత్స్యకారుల పడవ ఒక్కసారిగా బోర్లా పడటంతో అందులో ఉన్న వారిలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు కాకినాడ సూర్యారావుపేటకు చెందిన పి.మహేంద్ర, అప్పారావులుగా గుర్తించారు.
పడవలో ఉన్న మిగతా ఐదుగురు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. వీరంతా ఈ నెల 8న వేటకు వెళ్లారు. తుపాను కారణంగా పడవ ప్రమాదానికి గురైనట్లు ప్రమాదంలో బయటపడినవారు తెలిపారు. గల్లంతయిన వారి ఆచూకీ కోసం అధికారుల చర్యలు చేపట్టారు.