ఎస్‌ఆర్‌బీసీలో ఇద్దరు విద్యార్థినుల గల్లంతు
ఎస్‌ఆర్‌బీసీలో ఇద్దరు విద్యార్థినుల గల్లంతు
Published Tue, Oct 18 2016 5:20 PM | Last Updated on Sat, Aug 25 2018 5:38 PM
-కాలువలో గాలించినా లభించని ఆచూకీ
- ఆందోళనలో విద్యార్థినుల తల్లిదండ్రులు
బనగానపల్లె రూరల్ : ఎస్‌ఆర్‌బీసీ ప్రధాన కాల్వలో ఇద్దరు విద్యార్థినులు గల్లంతయ్యారు. మంగళవారం మధ్యాహ్యం బనగానపల్లె వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రివరకు ఆచూకీ లభించకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. బనగానపల్లె పట్టణం బేతంచెర్ల రోడ్డులోని కోళ్లఫారం సుబ్బారెడ్డి వీధిలో నివాసం ఉంటున్న మౌలిబాషా సాహెబ్ కుమారై నుస్రత్, వారి బంధువులు వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన షెహజదేపీరా కుమారై బషీర, మైనుద్దీన్ కుమారై యాసిన్ కలిసి సమీపంలో ఉన్న ఎస్‌ఆర్‌బీసీ ప్రధాన కాల్వ గట్టుపై ఆడుకునేందుకు వెళ్లారు. ఆడుకుంటుండగా నుస్రత్ ప్రమాదవశాత్తు కాల్వలో పడింది. పక్కనే ఉన్న బషీర, నుస్రత్‌ను రక్షించేందుకు కాలువలోకి దూకగా ఇద్దరు నీటి ప్రవాహంలో కొట్టుకోపోయారు. ఇది గమనించిన మరో బాలిక యాసిన్ వెంటనే ఇంటి వద్దకు వచ్చి వారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఘటన ప్రదేశానికి చేరుకుని కాలువలో గల్లంతైన బాలికల కోసం గాలించారు. ఆచూకీ కనిపించక పోవడంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటికే చీకటి పడడంతో పోలీసులు గాలింపు చర్యలు నిలిపివేశారు. గల్లంతైన బాలిక నుస్రత్ స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి అభ్యసిస్తుండగా, బషీర గత మార్చిలో పదోతరగతి పాస్ అయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తన ఇంట్లో వడుగుల కార్యక్రమం ఉండడంతో వైఎస్‌ఆర్ జిల్లా నుంచి బంధువులు వచ్చినట్లు మౌలిబాషా సాహెబ్ తెలిపారు.
Advertisement