విజయనగరం :
భూ తగాదాలకు సంబంధించిన విషయంలో ఇద్దరు హోంగార్డులు అరెస్టు అయ్యారు. తమకు సంబంధం లేకున్నా పోలీసులమని చెప్పి బెదిరించడం తరువాత అసలు విషయం బయటపడడంతో పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... భూ తగాదాలకు సంబంధించిన విషయంలో ఇద్దరు హోంగార్డులు తాము వన్‌టౌన్ పోలీసులమంటూ బాధితుని ఇంటికి వెళ్లి ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి ఆనందపురంలో ఉంచారు. కిడ్నాప్‌కు గురైన వ్యక్తి భార్య వన్‌టౌన్‌కి వచ్చి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి వన్‌టౌన్ పోలీసులు సీసీ పుటేజీలు ద్వారా విషయం తెలుసుకుని ఘటనకు పాల్పడిన ఇద్దరు హోంగార్డులను అరెస్ట్ చేశారు.
దీనికి సంబంధించి వన్‌టౌన్ సీఐ పి.శోభన్‌బాబు తెలిపిన వివరాలు...స్థానిక ప్రదీప్‌నగర్‌లో నివాసముంటున్న యర్రా ఈశ్వరరావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఈయనకు విశాఖలో ఉన్న అన్ని శ్రీనివాసరావుకు మధ్య వ్యాపార రీత్యా చాలాకాలం నుంచి గొడవలున్నాయి. అయితే ఈ నెల 5వ తేదీ రాత్రి ఇద్దరు పోలీసులు వచ్చి తాము వన్‌టౌన్ పోలీసులమని చెప్పి, ఈశ్వరరావును విచారణ నిమిత్తం తీసుకువెళ్తున్నామని చెప్పి కిడ్నాప్ చేసి విశాఖ ఆనందపురంలో ఓ ఇంట్లో బంధించారు. అయితే వన్‌టౌన్ పోలీసులమని చెప్పి తీసుకువెళ్లడంతో ఈశ్వరరావు భార్య వత్సవాయి వెంకటరత్నకుమారి పోలీసులను ఆశ్రయించింది. విషయం విన్న వన్‌టౌన్ పోలీసులు కేసుపై సత్వర దృష్టి సారించారు. వెంటనే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ పుటేజీలను స్వీకరించారు. వాటి ద్వారా నిందితులను క్షణాల్లో పసిగట్టారు. వారిలో పోలీసు శాఖకు చెందిన ఇద్దరు హోంగార్డులున్నట్టు గుర్తించారు. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్న బూర్లి శ్రీనివాస్, ఏపీఎస్పీలో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న బి.లక్ష్మణరావులను అదుపులోనికి తీసుకున్నారు. కేసును సీఐ నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
కిడ్నాప్ కేసులో ఇద్దరు హోంగార్డుల అరెస్ట్
Published Mon, May 8 2017 7:56 AM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM
Advertisement
Advertisement