మండల పరిధిలోని గుళ్లదూర్తి గ్రామానికి చెందిన గంగన్న, సుదర్శనమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం.
ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యాయత్నం
Published Fri, Apr 14 2017 12:50 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM
– మార్కులు తక్కువొచ్చాయని ఒకరు
– ఫెయిల్ అయ్యానని మరొకరు
– ఇరువురి పరిస్థితి సీరియస్
– కర్నూలుకు తరలింపు
ఇంటర్ ఫలితాలు ఇద్దరు విద్యార్థుల మనస్సులను గాయపరిచాయి. గురువారం వెలువడిన పరీక్షా ఫలితాలు జీర్ణించుకోలేక ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు, ఫెయిల్ అయ్యానని మరొకరు బలవన్మరణానికి ప్రయత్నించారు. ఈ రెండు సంఘటనలు మండల పరిధిలోని వేర్వేరు గ్రామాల్లో చోటుచేసుకున్నాయి.
కోవెలకుంట్ల: మండల పరిధిలోని గుళ్లదూర్తి గ్రామానికి చెందిన గంగన్న, సుదర్శనమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం. గంగన్న ఉయ్యాలవాడ మండలంలో వెలుగు కార్యాలయంలో సీసీగా పనిచేస్తున్నాడు. కూతురు అల్లూరు సుమలత నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సర బైపీసీ చదువుతోంది. ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో ఫెయిల్ అయినట్లు తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పుంటించుకుంది. స్థానికులు మంటలు ఆర్పి 108 అంబులెన్స్‌లో కోవెలకుంట్ల ఆస్పత్రికి తరలించారు. 70శాతం శరీరభాగాలు కాలిపోవడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మార్కులు తక్కువ వచ్చాయని..
మండలంలోని గుంజలపాడు గ్రామానికి చెందిన రాజారెడ్డికి ఇద్దరు కుమారులు సంతానం. పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. రెండో కుమారుడు సతీష్‌రెడ్డి కర్నూలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సర బైపీసీ చదువుతున్నాడు. ఫలితాలు విడుదల కానుండటంతో తండ్రితోపాటు కోవెలకుంట్లకు వచ్చాడు. ఇంటర్ ఫలితాల్లో 420 మార్కులు రావడంతో తన స్నేహితుడికంటే మార్కులు తక్కువ వచ్చాయని మనోవేదనకు గురయ్యాడు. తాను తర్వాత వస్తానని తండ్రిని ఆటో ఎక్కించి పంపాడు. క్రిమి సంహారక గుళికలు మింగి బైక్‌పై ఇంటికి చేరుకుని వాంతులు చేసుకోవడంతో గమనించిన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీధర్ పేర్కొన్నారు.
Advertisement
Advertisement