
కోడికూర వివాదం.. ఇద్దరి హత్య
కోడికూర కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదం ఇద్దరు వ్యక్తుల హత్యకు దారితీసింది.
అనంతపురం: జిల్లాలోని మదిగుబ్బ మండలం కొడవాండ్లపల్లెలో దారుణం జరిగింది. కోడికూర కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదం ఇద్దరు వ్యక్తుల హత్యకు దారితీసింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గ్రామంలో పెద్దన్న, ఆదినారాయణ అనే ఇద్దరు వ్యక్తులకు చెరో చికెన్ షాపు ఉంది. బుధవారం సాయంత్రం ఆదినారాయణకు బంధువైన రామకృష్ణ అనే వ్యక్తి.. పెద్దన్న షాపులో చికెన్ కొన్నాడు. దీన్ని గమనించిన నాగముని అనే మరో వ్యక్తి.. 'మనవాడి షాపులో కాకుండా వేరేవాడి షాపులో చికెన్ ఎందుకు కొన్నావ్' అని రామకృష్ణను నిలదీశాడు.
'అతను ఎక్కడ కొంటే నీకెందుకు నీ పని నువ్వు చూసుకో'అని షాపు ఓనర్ పెద్దన్న అన్నాడు. దీంతో గొడవ మొదలైంది. ముగ్గురూ పెనుగులాడారు. ఈ క్రమంలో రామకృష్ణ ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు చికెన్ గొడవ కాస్తా ఊరి గొడవగా మారింది. కోపోద్రిక్తులైన రామకృష్ణ బంధువులు పెద్దన్న ఇంటిపై దాడి చేశారు. అక్కడ జరిగిన ఘర్షణలో పెద్దన్న హత్యకు గురయ్యాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.