పండగ పూట విషాదం
-
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
-
-భార్యాభర్తలు దుర్మరణం
అల్లూరు : దసరా పండగ కావడంతో తన సోదరి ఇంటికి వెళ్తున్న భార్యాభర్తలను ఆర్టీసీ బస్సు బలిగొంది. ఈ ఘటన మండలంలోని బీరంగుంట వద్ద మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వెంకటగిరికి చెందిన రాజేష్ (28)కు కొడవలూరు మండలం గుండాలమ్మపాళెంకు చెందిన శిరిష(22)తో ఐదు నెలల క్రితం వివాహమైంది. దసరా పండగ కావడంతో అత్తారింటికి వచ్చిన రాజేష్ అల్లూరు దళితవాడలో ఉన్న తన సోదరి ఇంటికి భార్యాభర్తలు బయలుదేరారు. బీరంగుంట ఇటుక బట్టీల వద్దకు వచ్చేసరికి నెల్లూరు నుంచి అల్లూరు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొంది. బస్సు చక్రాల కింద పడటంతోభార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలిసి రాజేష్, సోదరి, బావ బంధువులు, శిరిష కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. కోవూరు సీఐ మాధవరావుకు సమాచారం తెలియజేయడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అల్లూరు ఎస్‌ఐ వీరేంద్రబాబు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.