రైలు ఢీకొని మంత్రి బంధువు దుర్మరణం
రాప్తాడు :
మండల పరిధిలోని ప్రసన్నాయపల్లి సమీపంలో బుధవారం రాత్రి రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒకరు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సమీప బంధువు. మరొకరు గుంటూరు జిల్లా వాసి. వివరాలిలా ఉన్నాయి. మంత్రి సునీత మేనమామ గొరిదిండ్ల కృష్ణమూర్తి నాయుడు కుమారుడు గిరీష్ నాయుడు (31), గుంటూరు జిల్లాకు చెందిన అరవిందకుమార్ (30) రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థలో పనిచేస్తున్నారు. గిరీష్ నాయుడు సైట్ కోఆర్డినేటర్ (ఎస్‌సీవో) కాగా.. అరవిందకుమార్ ఫైబర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. 44వ జాతీయ రహదారి పక్కనున్న అయ్యవారిపల్లి సమీపంలోని రిలయన్స్ 4జీ టవర్, ప్రసన్నాయపల్లి పంచాయతీ చిన్మయనగర్‌లోని మరొక 4జీ టవర్ మధ్య ఫైబర్ ఆప్టికల్ కేబుల్ అనుసంధానం చేయాల్సి ఉంది.
దీంతో వీరిద్దరూ బుధవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో రూట్ సర్వేకు వెళ్లారు. రైల్వేలైన్ మీదుగా కేబుల్ తీసుకెళ్లాల్సి ఉంది. దీంతో అనుమతి కోసం రైల్వే శాఖకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ప్రసన్నాయపల్లి సమీపంలోని రైల్వే ఐరన్ బ్రిడ్జిపై ఎల్‌సీ నంబర్లు తెలుసుకోవడానికి దానిపైకి వెళ్లారు. నంబర్లు చూస్తున్న సమయంలోనే రైలు వచ్చింది. ఎటూ తప్పించుకోవడానికి వీలు లేకపోయింది. క్షణాల్లోనే రైలు వారిని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
తెల్లవారుజామున వెలుగులోకి..
రాత్రి ఏడు గంటలకే ఘటన జరిగినా గురువారం తెల్లవారుజామున రెండు గంటల దాకా వెలుగులోకి రాలేదు. తమవారు రాత్రి ఎంతసేపటికీ ఇళ్లకు రాకపోయేసరికి వారి కుటుంబ సభ్యులు పదేపదే ఫోన్లు చేశారు. అయితే..వారి ఫోన్లు పనిచేయలేదు. దీంతో ఆఫీసు సిబ్బందితో వాకబు చేశారు. రూట్ సర్వే విషయం గురించి తెలుసుకుని అటుగా గాలింపు మొదలుపెట్టారు. చివరకు రెండు గంటల సమయంలో వారి మృతదేహాలను రైలుపట్టాలపై కనుగొన్నారు.
సంఘటన స్థలాన్ని ధర్మవరం రైల్వేసీఐ జగదీష్, ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, మంత్రి సోదరులు బాలాజీ, ధర్మవరం మురళి పరిశీలించారు. బెంగళూరు నుంచి భువనేశ్వర్‌కు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.