ఇద్దరిని మింగిన చెరువు
-
∙ఈతకు వెళ్లి యువకుల మృతి
-
∙ప్రాణం తీసిన సరదా
ములుగు : ధర్మసాగర్ రిజర్వాయర్‌లో మునిగి యువకులు మృతిచెందిన సంఘటనను మరువక ముందే.. అదే తరహాలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. ములుగుకు చెందిన ఇద్దరు యువకులు లోకం చెరువులో ఈతకు వెళ్లి.. లోతైన గుంతలో మునిగి ప్రాణాలు వదిలారు. గాంధీ జయంతి సెలవుదినం కావడంతో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి మృ త్యువాత పడ్డారు. కన్నవారికి కడుపుకోతను మిగిల్చారు. వివరాల్లోకి వెళ్తే.. ములుగు మండల కేంద్రానికి చెందిన ఎండీ హుస్సేన్కు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు షంషుద్దీన్ (20) ఐటీఐ చేశాడు. స్థానికంగా సెల్‌షాప్‌ను నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఆదివారం గాంధీ జయంతి కావడంతో షంషుద్దీన్ షాపునకు వెళ్లకుండా ఎండీ అంకూస్, అహ్మదీ(మున్నా) దంపతుల కుమారుడు ఫయాజ్ (20), మరో స్నేహితుడు నాగరాజుతో కలిసి ఉదయం 10.30 గంటలకు లోకం చెరువులో ఈతకు వెళ్లాడు.
మార్గం మధ్యలో మద్యం తాగారు. అనంతరం ఈత కొట్టేందుకు చెరువులోకి ఫయా జ్, షంషుద్దీన్ దిగారు. ఈత రాకపోవడంతో స్నేహితుడు నాగరాజు ఒడ్డునే కూర్చున్నాడు. కొద్దిసేపు జాలీగా ఈతకొట్టిన ఇద్దరు మిత్రులు, చెరువులో లోతుగా ఉన్న ప్రదేశంలో అకస్మాత్తుగా దిగబడసాగారు. ఈక్రమంలో ఒకరికొకరు సాయం అందించుకునే ప్రయత్నం చేశారు. ఒడ్డుకు చేరుకునేలోపు లోతులో మునిగిపోయారు. ఒడ్డుకు నిలబడిన స్నేహితుడు నాగరాజు కేకలు వేశాడు. అనంతరం స్నేహితుల బంధువులకు సంఘటనపై సమాచారం అందించాడు. ఎస్సై మల్లేశ్‌యాదవ్, మృతుల బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని జాలర్ల సాయంతో మృతదేహాలను వెలికితీయించారు. మృతదేహాలను ములుగు సివిల్ ఆసుపత్రి మార్చురీ గదిలోకి తరలించేందుకు వైద్యుడు మనోహర్ నిరాకరించారు. దీంతో ములుగు సర్పంచ్ గుగ్గిళ్ల సాగర్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో ధర్నా చేశారు.
కళ్ల ముందే మునిగిపోయారు..
- నాగరాజు, మృతుల స్నేహితుడు
నాకు ఈత రాదు. దీంతో చెరువు ఒడ్డునే నిలబడ్డాను. షంషుద్దీన్, ఫయాజ్‌లు ఈత కొడుతూ మునిగిపోతున్న క్రమంలో వారిని కాపాడేందుకు ప్యాంట్, షర్ట్‌లను విసిరాను. వాటిని వాళ్లు అందుకోలేకపోయారు. నీటిలో మునిగిపోకుండా ఉండేందుకు ప్రయత్నించారు. కానీ అది సాధ్యపడక.. నా మిత్రులు ఇద్దరూ నా కళ్ల ముందే చెరువులో మునిగిపోయారు. ఎంతో బాధగా ఉంది.
అదే చివరి చూపైంది..
– హుస్సేన్, మృతుడు షంషుద్దీన్ తండ్రి
‘‘నా కొడుకు కుటుంబానికి అండగా ఉంటాడనుకున్నా. ఏ రోజూ నా కొడుకును ఒక్కమాటా అనలేదు. ఏదో తన పని తాను చేసుకుంటున్నాడని అనుకున్నా. శనివారమే ఇంటర్‌లో తప్పిన సబ్జెక్టుకు సంబంధించిన సప్లిమెంటరీ పరీక్ష రాశాడు. ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటికిపోతూ కనిపించాడు. అదే చివరి చూపవుతుందని కలలో కూడా అనుకోలేదు. ఒంటి గంట సమయంలో చెరువులో మునిగిపోయాడని తెలిసింది. ఈత వచ్చిన నా కొడుకు చెరువులో శవమైతడని అనుకోలేదు.’’